Vaisaakhi – Pakka Infotainment

సకల దోషాల నుంచి విముక్తి చేసే శనీశ్వరుని దివ్య క్షేత్రం

గ్రహదోషాలంటేనే.. చాలామంది బెంగ పడిపోతారు.. అలాంటిది శనిగ్రహ దోషం అంటే మరీ భయపడిపోతారు.. మానవ జీవితం లో అత్యంత ప్రభావం చూపించే శనిగ్రహదోషాలకు, ఏం చేస్తే విముక్తి లబిస్తుంది.. ఎలాంటి దానాలు ఇస్తే ఫలితం వుంటుందని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని తెగ అడిగేస్తుంటాం … ఎవరికీ తోచింది వాళ్ళు చెప్తుంటారు.. ఎవరికీ వీలైంది వాళ్ళు చేస్తుంటారు.. ఎవరు ఏం చేసినా.. ఎవరు ఏం చెప్పినా మనకి వున్నా శని గ్రహదోషాలన్నిటిని సంపూర్ణంగా పోగొట్టే క్షేత్రం మాత్రం ఒకటుంది.. దర్శనమాత్రం తోనే సకల పాపాలనుంచి , సర్వదోషాలనుంచి మనల్ని విముక్తులను చేసే ఆ విశిష్ట దివ్యక్షేత్రమే తిరునల్లార్ శనీశ్వరన్ కోవిల్. ‘ నీలాంజన సమాబాసం… రవిపుత్రం యమాగ్రజం.. ఛాయామార్తండ సంభూతం… తమ్ నమామి శనేశ్చరం.. అంటూ ఆర్తి గా అడిగితే చాలు భక్తిగా ధ్యానిస్తే చాలు గోచారరీత్యా వచ్చే దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది..

శని ప్రభావం నుంచి విముక్తి కలిగించేదిగా పేరు గాంచిన ఈ పుణ్య క్షేత్రం భారతదేశం లో ఉన్నటువంటి శనీశ్వరాలయాల్లో అతి పురాతనమైనది… కృతయుగ ప్రారంభంలో ఆదిపురిగా.., త్రేతాయుగంలో ధర్మారణ్యంగా.., ద్వాపరయుగం లో వేదపురిగా…, ఈ కలియుగంలో నలేశ్వరం గా…పిలవబడి నాలుగుయుగాలలో సైతం విశేష పూజలందుకుంటున్న దివ్యక్షేత్రమే తిరునల్లార్ దేవాలయం.. నల్లా… ఆర్ నల్లార్ అంటే… భరద్వాజ మహర్షి సూచన మేరకు నలమహారాజు తన పాప కర్మల నుంచి విముక్తి పొందిన ప్రాంతం అని అర్ధం. వేల సంవత్సరాల ఇతిహాస చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రం పాండిచెర్రి రాష్ట్రం లోని కారైకల్ జిల్లా కేంద్రానికి సరిగ్గా ఏడుకిలోమీటర్ల చేరువలో టెంపుల్ సిటీ గా పేరుగాంచిన కుంభకోణం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ శని దేవాలయం తో పాటు కుంభకోణం చుట్టుపక్కల పరిధి లో నవగ్రహాలకు విశిష్ట ఆలయాలు వున్నాయి.. అన్ని గ్రహాల ఆలయాల్లో ప్రధాన దైవం పరమశివుడు కాగా ఒక్క సూర్యనార్ కోవిల్ లో మాత్రం సూర్యభగవానుడే ప్రధాన దైవం. తిరునల్లార్ దేవాలయం శ్రీ ధర్భారణ్యేశ్వర స్వామి దేవస్థానం లో ఉప ఆలయంగా వుంటుంది.. ధర్భలతో విశేషం గ అర్చించే ఈ ధర్భారణ్యేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచితే దోషాలను పోగొట్టే దైవంగా శనీశ్వరస్వామి పూజలందుకుంటున్నారు.. ఇక స్వామి ని దర్శించి తమ దోషగుణలను నివృత్తి చేసుకునేందుకు వచ్చే భక్తులు పూర్వం బ్రహ్మతీర్ధం గా పిలవబడే నలుడు స్నానమాచరించిన ఈ నలతీర్ధం లో… , నల్లటి వస్త్రాన్ని ధరించి శరీరానికి నువ్వుల నూనె రాసుకుని పవిత్ర స్నానమాచరించాలి.. స్నానం చేసేటప్పుడు వినియోగించే వస్తాలను అక్కడే విడిచి పెట్టి పక్కనే వున్నా వినాయకుని ఆలయం వద్ద కొబ్బరికాయని దిష్టి తీసుకుని శనీశ్వరస్వామి దర్శనానికి వెళ్ళాల్సి వుంటుంది.. త్రయోదశి రోజున దేవతలు సైతం తమ కున్న గ్రహ దోషాలను పోగొట్టుకునేందుకు ఈ క్షేత్రానికి వచ్చి తీర్ధం లో స్నానమాచరించి శని భగవానుని ధర్శిచుకుని తమ పాప దోషాలను తొలగించుకుంటారని పండితులు చెప్తుంటారు.. ఇన్ని వేల మంది నువ్వులనూనె ను వంటికి రాసుకుని పుష్కరిణిలో స్నానమాచారించినా అసలు నీటిపై నూనె తెట్టె తెరకపోవడం విశేషం కాగా…. సూర్యపుత్రుడైన శనిదేవుడు మందగమనుడు దాన్ని ఋజువు చేస్తూ సైన్స్ కు సైతం సవాల్ విసిరే అంశమొకటి ఇక్కడ నెలకొంది.. ఈ ఆలయం మీదుగా వెళ్ళే విమానాలుగాని శాటిలైట్స్ గాని అంత వరకు ఎంతవేగంగా వచ్చినా సరే ఇక్కడికి రాగానే నెమ్మదిస్తాయని గుర్తించారు.. దీనిపై పరిశోదనలు కూడా జరిగాయని చెప్తుంటారు.. అతిపెద్దఆలయం లో ఓ చిన్న మందిరంలో కొలువు తీరే శనిమహాదేవుడు అభయహస్తం తో చిరుమందహాసంతో భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నట్టుగా దర్శనం ఇస్తుంటారు…

అర్చన, అభిషేకం, నిర్వహించుకున్న అనంతరం ఆలయ ఆవరణలో వుంటే ప్రత్యేకమైన షెడ్ లో దీపాలను వెలిగిస్తారు..దానాలు ఇచ్చేవారికి దాన సామగ్రి అంతా ఇక్కడి షాపులలో ప్రత్యేకంగా దొరుకుతుంది.. అలాగే దానాలు స్వీకరించే పురోహితులు కూడా ఇక్కడ అందుబాటులో వుంటారు.. శనీశ్వరుడు అంటే ఓకే రకమైన భయంతో, ఆందోళనతో వుండే చాల మంది కి ఆయనంత ప్రసన్నవధనుడు మరొకరు ఉండరని ఈ ఆలయ దర్శనం తో నిరూపితమవుతుంది.. ప్రతి శనివారంనాడు ప్రత్యేకించి శని త్రయోదశి రోజున వేల సంఖ్య లో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.. రెండేళ్ళకి ఒకసారి జరిగే ప్రత్యేక ఉత్సవం.., రధోత్సవం కనుల పండువగా జరుగుతుంది.. దూరప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చే భక్తులకు హోటల్స్ కూడా ఆలయ సమీపలోనే వున్నాయి.. స్వయంగా రాలేని భక్తులకు దేవస్థానం ప్రత్యేకపూజలు, హోమాలను నిర్వహిస్తోంది.. పరీక్ష పెట్టి సరిదిద్దే తత్వమే శనీశ్వర తత్వం.. అలాంటి ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్న సకల మానవాళికి భగవాన్ శనీశ్వరుని అనుగ్రహం లభించి గ్రహదోష విముక్తులు కావాలని ఆశిస్తూ సర్వేజనాసుఖినో భవంతూ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More