ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతం టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా చక్రం తిప్పిన వాసుపల్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పార్టీలోకి చేరారు. పార్టీలోకి అయితే చేరారు కానీ అటు స్థానిక నేతలు, ఇటు అధికారులు కూడా సహాయ నిరాకరణ చేస్తూ ఆయన్ని దూరంగా పెడుతున్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదన్న మానసిక వేదనతో ఆ మధ్య నియోజకవర్గ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. కొందరు పార్టీ నేతల బుజ్జగింపు తో చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయినప్పటికీ పార్టీ పరంగా తన నియోజకవర్గంలో సొంత నాయకులు తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారనేది అతని అభిమానుల ఆరోపణ. టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ వైసీపీలోకి వాసుపల్లి రావడం జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే తన అధికారం పార్టీలో ఉండటం శ్రేయస్కరం అని భావించి తన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన మీదట పార్టీ మారాల్సి వచ్చింది. పార్టీ మారిన తర్వాత కొన్ని నెలల పాటు పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ రాను రాను ఆ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిట్టింగ్ కార్పొరేటర్లు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలెట్టారు. ఎవరికి వారు తమకు గల మార్గాల ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు తొమ్మిది మందికి పైగా ఉన్న వైసిపి కార్పొరేటర్లు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తమలో ఒకరిని మాత్రమే పార్టీ అధిష్టానం ఎంపిక చేయాలని ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వైసిపి కార్పొరేటర్ల లో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అలా కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కూడా రంగంలోకి దిగి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మరోపక్క వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ కార్పొరేటర్లు జరుగుతున్న వ్యవహారం అంత గమనిస్తున్నారు. అటు వాసుపల్లి, ఇటు సుధాకర్ లు టికెట్ కోసం సకల గా తన ప్రయత్నాలు చేస్తూ ఉండటంపై గుర్రుగా ఉన్నారు. అందుకే నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్ ఎవరు హాజరు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కైతే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ నియోజకవర్గంలో రావద్దని హెచ్చరించారు. అధిష్టానానికి అతనికోసం ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులను, కార్యకర్తలను అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి వారిద్దరికీ వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకునిగా, ఆ పార్టీ ఎమ్మెల్యే గా ఒక వెలుగు వెలిగిన వాసుపల్లి గణేష్ కుమార్ కు ఇప్పుడు అయితే చేదు అనుభవం ఎదురవుతుంది. వైసీపీ నాయకులు ఎవరు తనను ఖాతరు చేయకపోవడం. తనపై విష ప్రచారం చేయడం. పార్టీ నుంచి తనను వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేయడం పై వాసుపల్లి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. వాసుపల్లి వైసిపిలో ఉన్నప్పటికీ అతనిపై ఇంకా టిడిపి ముద్ర వేస్తున్నారు వైసిపి నాయకులు. తన రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు వాసుపల్లి సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయన వైసీపీలో కొనసాగుతారా లేదా తిరిగి టిడిపికి వెళ్తారా అనే చర్చ సాగుతుంది. అయితే టిడిపి నుంచి ఈ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండి బాబ్జి ని బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గండి బాబ్జి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపడుతూ ప్రజలకు చేరువ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో అటు వైసీపీ నుంచి ఇటు టిడిపి నుంచి వాసు పల్లికి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం అయితే లేదనేది స్పష్టమవుతుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరికీ తెలియని విధంగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే వాసుపల్లిని బయటికి పంపించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాహాటంగానే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
previous post
next post