విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో మరో మణిమకుటం చేరింది. స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ లోగోను తిరుమలలో ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆవిష్కరించారు. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరబడి సృష్టించేందుకే కొత్త ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేసామని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తెలిపారు.. యువత ద్వారా వినూత్నంగా ధర్మప్రచారం సాగిస్తుందని తెలిపారు. ధర్మం అంటే పూజలు మాత్రమే కాదని, జ్ఞాన రాశి అని కూడా తెలిపేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ధర్మ ప్రచారం పేరుతో చాలామంది ప్రవచనాలు, ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారని, ఈ సంస్థ అందుకు భిన్నంగా పనిచేస్తుందని వివరించారు. అన్యమత ప్రచారాన్ని నిలువరించేందుకు మారుమూల గిరిజన, హరిజన, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తుందన్నారు. పసుపు, కుంకుమ, తెలుపు కలయికలతో స్వధర్మ వాహిని లోగోను రూపుదిద్దామని తెలిపారు. కల్మషాన్ని పోగొట్టేది పసుపు రంగు అయితే, తెలుపు ధర్మపధం వైపు నడిపిస్తుందని, కుంకుమ జ్ఞాననేత్రానికి సంకేతమని వివరించారు. ఎంత కష్టమైనా విశాఖ శ్రీ శారదాపీఠం ధర్మపధం వైపే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. స్వధర్మ వాహిని సంస్థ ద్వారా అద్భుతం సాధించాలన్న ఆలోచనతోనే శ్రీవారి పాదాల చెంత తిరుమలలో ఈ సంస్థను ప్రారంభించామన్నారు.
previous post