మాల ధారణం నియమాల తోరణం అంటూ… అత్యంత నియమ నిష్ఠలతో మండల కాలం దీక్ష పూని శబరి గిరులలో కొలువైన అయ్యప్పను దర్శించుకోడానికి వెళ్ళే భక్తులకు కేరళ ప్రభుత్వం రోజుకు 80 వేల మందికే దర్శనం అంటూ గీసిన లక్ష్మణ రేఖ ఆమోద యోగ్యమేనా..?దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు దీనికి అంగీకరిస్తారా…? ఇప్పుడిదే చర్చ మొదలైంది..
80వేల మందికి వర్చువల్ క్యూ బుకింగ్ విధానం అమలు చేయాలని కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. మరికొన్ని రోజుల్లో
కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో తమ దర్శన టిక్కెట్ ను బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.
ఈ వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా భక్తులు ఎంపిక చేసుకోవచ్చని అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
. అయ్యప్ప దేవాలయం ఇతర దేవాలయాల మాదిరిగా నిత్యం తెరిచి వుండే ఆలయం కాదని అలాంటప్పుడు దర్శన కోటా విధించడం సబబు కాదని.. దేశవ్యాప్తంగా వుండే అయ్యప్ప భక్తులు దీక్షలు ముగించుకుని వచ్చిన నేపథ్యం లో వారికి అయ్యప్ప దర్శన భాగ్యం దక్కకపోతే చాలా ఇబ్బంది పడతారని భక్తులు అంటున్నారు.. తిరుపతి లాంటి అత్యధిక భక్తులు వచ్చే దేవాలయాల్లో సైతం సర్వదర్శనం చేసుకునే అవకాశం వుండగా ఈ ప్రత్యేక దేవాలయం లో ఈ నిబంధన భక్తుల రాక ను నియంత్రించడానికే అని అంటున్నారు..
అయ్యప్ప ను దర్శించుకోవడానికి కొన్ని ప్రత్యేక దినాలలో లక్షలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు.. అలాంటి సమయాల్లో ఈ కొత్త విధానం ద్వారా భక్తులను నియంత్రిస్తే పరిస్థితి ఏంటి..? దానికి అసంఖ్యాక మైన భక్తులు అయ్యప్ప దర్శనం లేకుండానే వెనుతిరిగి వెళ్తారా..? లేక ప్రభుత్వం ఆరోజుల్లో చేతులెత్తేస్తుందా…? వామపక్ష ప్రభుత్వం హిందూ మనోభావాలను గుర్తించకుండా ఇలా చెయ్యడం అయ్యప్ప భక్తులను అవమానించడమేనని అంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి కనీసం ఫోన్ ,రోడ్ సౌకర్యం కూడా లేని భక్తులు ఆన్లైన్ లో తమ టిక్కెట్ బుక్ చేసుకుని స్వామి ని దర్శించుకునే అవకాశం ఉంటుందా..? అలాంటి స్వాములు కూడా అయ్యప్ప ను దర్శించుకోవాలంటే మళ్ళీ దళారీ వ్యవస్థ ను ఆశ్రయించాల్సిందేనా..? ఇలా ఎన్నో ప్రశ్నలు భక్తుల నుంచి కేరళ ప్రభుత్వం ఈ సందేహాలను తీరుస్తుందా..? అప్పటికి చూద్దాం లే అనుకుంటుందా…? లేక సాక్షాత్తూ అయ్యప్ప ఈ సమస్యను పరిష్కరిస్తాడా…? చూడాలి మరి..!