Vaisaakhi – Pakka Infotainment

దట్టమైన అరణ్యం లో ఇన్నాళ్లు రహస్యం గా… ఇప్పుడు ప్రసన్న వదనం గా…

నిరంతరం కాల్పుల మోత తో దద్దరిల్లి పోయే దట్టమైన అరణ్యం. సముద్ర మట్టానికి మూడువేల ఎత్తులో శిఖరం.. ప్రకృతి సమక్షంలో కొలువు తీరిన గణనాథుడి ప్రతిమ. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, శతాబ్దాల నాటి సంప్రదాయాలకు అది నిలువెత్తు నిదర్శనం.. ఈ ప్రకృతి గణపతిని దర్శించాలంటే ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్ నుండి 350 కి.మీ దూరంలో ఉన్న దంతేవాడ జిల్లాలోని ధోల్కల్ అనే పర్వతం పైకి వెళ్ళాల్సిందే. దట్టమైన అడవి లో కాలినడకన వెళ్ళాలి.

శతాబ్దాలు గా రహస్యంగానే..

1100 సంవత్సరాల పూర్వం నాటిదైన ఈ మూర్తిని 2012 లో ఒక పురావస్తు శాస్త్రవేత్త(కొంతమంది ఓ జర్నలిస్టు అని చెప్తుంటారు.) కనుక్కునేంత వరకు శతాబ్దాలపాటు రహస్యంగానే వుంది ఈ విగ్రహం. ఒక్క చిన్న స్థంభం లాంటి కొండ… నడిచి వెళ్ళడం కూడా సాధ్యం కాని ఆ ప్రదేశం లో ఈ విగ్రహాన్ని అంత ఎత్తున ఎవరు ప్రతిష్టించారు అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీ గానే ఉంది. వివిధ పరిశోధనల ప్రకారం నాగవంశీయులు కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. దీనికి సమీపంలో రాతి యుగానికి చెందిన కొన్ని ఆయుధాలు దొరకడంతో ఇక్కడ ఆదిమానవులు జీవనం కొనసాగించారని కూడా పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు.

పరశురాముడితో వినాయకుడి యుద్ధం..

ఇదిలా వుంటే స్థానికుల కథనం ప్రకారం, పురాణకాలం లో ఈ ధోల్కల్ కొండపై గణేశుడు కి పరశురాముడు మధ్య భీకర యుద్ధం జరిగిందని దీనిలో పరశురాముడు తన గొడ్డలి (ఫర్సా) తో వినాయకుడిపై దాడి చేశారని అంటుంటారు. ఒక చేతిలో గొడ్డలి (ఫర్సా) మరియు మరొక చేతిలో విరిగిన దంతాన్ని కలిగి ఉన్న విగ్రహం ప్రకారం గణేశుడు ధోల్కల్ కొండ పైనే తన దంతాలలో ఒకదాన్ని పరశు రాముడి చేతిలో కోల్పోయాడని చెపుతుంటారు. అందుకే ఈ మూర్తి ని ఏకదంత గణపతి గా భావిస్తారు.. ఆ యుద్ధ నేపథ్యం లో పరశురామ సమేత గణేశుని జ్ఞాపకార్థం చిందక్ నాగవంశీ రాజవంశం రాజులు 11వ శతాబ్దంలో కొండపైన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని సుమారు 2.5 నుండి 3 అడుగుల ఎత్తు వుండే ఈ విగ్రహం ధోలక్ ఆకారంలో ఇంద్రావతి నది అడుగున ఉన్న రాళ్లతో ఈ విగ్రహం చెక్కబడటం తో ఈ కొండకు ధోల్కల్ అని పేరు వచ్చిందంటారు. . విలక్షణమైన లలితాసనంలో సున్నితమైన భంగిమలో కూర్చున్నట్లు కనిపించే ఈ మూర్తి ప్రసన్నవధనుడు. దక్షిణ బస్తర్‌ లోని భోగామి గిరిజనులు ధోల్‌కట్టా ధోల్కల్‌లోని మహిళా పూజారి లెగసీ నుండి వచ్చిన వారని స్థానికులు విశ్వసిస్తారు మరొక కథనం ప్రకారం, ధోల్కల్ గణేశ విగ్రహాన్ని మొదట్లో ఒక భోగామి గిరిజన స్త్రీ పూజించేదని ఆమె పర్వతం పై నుండి శంఖం ఊదినప్పుడు ఫర్శాపాల్ గ్రామ నివాసితులు మేల్కొనేవారని చెపుతుంటారు.. స్థానికుల నిత్య పూజలతో అలరారే ఈ గణపతికి జనవరి, ఫిబ్రవరి మధ్యలో వచ్చే మాఘ మాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు..

విగ్రహ ధ్వంసం

ఛత్తీష్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని ట్రావెల్ స్పాట్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. అదే సమయం లో ఇంత పురాతనమైన, వైవిధ్య విశిష్ఠత కలిగిన ఈ స్వామిని భక్తులంతా దర్శించుకోవాలని, తద్వారా ఆ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి జరగాలని భావించిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులను కేటాయించింది. అయితే ఇది మావోయిష్టులకు అత్యంత కీలకప్రాంతం కావడంతో 2017 లో జనవరి చివరలో, ఈ స్వామి విగ్రహాన్ని ఆ కొండ మీది నుంచి క్రిందకు పడేశారు. దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆ దివ్యశిలా విగ్రహం ముక్కలైంది. బస్తర్ పోలీసులు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కొండ పాదాల వద్ద విగ్రహ శిధిలాలను కనుగొని సేకరించడానికి దర్యాప్తు ప్రారంభించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించిన పర్యాటకం కారణంగా స్థానిక గిరిజనులు ఉపాధి పొందడం తో స్థానికం గా పట్టు వున్న మావోయిస్టులు ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా నిరోధించేందుకు, సందర్శకులను ఆ ప్రాంతంలోకి రాకుండా చేసేందుకు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం పురావస్తు శాఖ అధికారులు స్థానిక గిరిజనులు తో కలసి ఆ ప్రాంతమంతా గాలించి, పాదాలకి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ అడవిలో వెతికి, అన్ని బాగాలను సేకరించి అదే ఏడాది ఫిబ్రవరి 2న, భారత పురావస్తు శాఖ ద్వారా ఏకదంత విగ్రహాన్ని తిరిగి ధోల్కల్ కొండపై ఉన్న అసలు ప్రదేశానికి పునరుద్ధరించారు. ఎంతో విశిష్టమైన ఈ స్వామి అక్కడ కొలువు తీరడమే ఓ అద్భుతం అనుకుంటే.. దాన్ని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ధ్వంసం చేయడం హృదయ విదారకమైన విషయం….

ధోల్కల్ గణేశ దేవాలయం వరకు ట్రెక్కింగ్

జగ్దల్‌పూర్ నుండి ట్రెక్కర్లు సమీపం లో వుండే ఫర్సాపాల్ (పరశు రాముడి గొడ్డలి కారణంగా ఈ ఊరు కి ఫర్శా అని పేరు వచ్చిందంటారు) గ్రామానికి చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది, ఇది ధోల్కర్ గణేశ ట్రెక్‌ కి బేస్ పాయింట్. ట్రెక్ పూర్తి చేయడానికి పూర్తిగా పదహారు గంటల సమయం పడుతుంది దట్టమైన శంఖాకార అడవుల గుండా వెళ్ళడానికి స్థానికంగా వుండే గైడ్ సేవలను ఉపయోగించుకోవాలి.. ఈ పవిత్ర ప్రదేశానికి విస్మయం కలిగించే తీర్థయాత్ర దట్టమైన మరియు ఆధ్యాత్మిక అడవి గుండా సుమారు 3 కిలోమీటర్ల సవాళ్లతో కూడిన ట్రెక్‌ ఆధ్యాత్మిక తో కూడిన ఆహ్లాదానుభూతిని కల్గిస్తుంది.. 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More