వినాయక చవితి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.. వూరు వాడ… గల్లీ ఢిల్లీ అన్న తేడా లేదు… మొత్తం విశ్వం అంతా గణపతి జై జై ద్వానాలతో మారు మ్రోగి పోతుంది.. నిమజ్జనం వరకు అన్ని చోట్ల ఇదే సందడి.. చవితి నుంచి అనంత చతుర్దశి వరకు ఒకటే నినాదం ‘గణపతి బప్పా మోరియా’ పిల్లలు పెద్దలు అన్న భేదం లేకుండా అందరి నోటా ఇదే మాట.. ఇంతకీ మోరియా అంటే అర్థం ఏంటి..? ఆ పదం ఏ భాష..?మోరియా అన్న మాట గణపతి ఉత్సవాల్లో నినాదంగా ఎలా మారింది..?
15వ శతాబ్దంలో మహారాష్ట్రాలోని పునే కు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి గ్రామంలో మోరియా గోసాని’ అని ఒక సాధువు ఉండేవాడు. వినాయకునికి పరమ భక్తుడైన ఆయన గణపతి పూజ కోసం చించ్ వాడి నుంచి మోరే గావ్ కు ప్రతిరోజు కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు సాధువు కు విఘ్నేశ్వరుడు స్వప్నంలో కనిపించి.. సమీపంలో గల నదీగర్భం లో తన విగ్రహం ఉందనీ.. దాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించమని చెప్పాడట.. అయితే కలలో వినాయకుడు చెప్పనట్టే నదిలో వినాయకుడి విగ్రహం దర్శనమిచ్చింది.. తన ఇష్ట దైవాన్ని చూసిన మోరియా అత్యంత భక్తి ప్రపత్తులతో విగ్రహాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహించి ఉత్సవాలు ఘనంగా చేయనారంభించారు..
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత పుణ్యాత్ముడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో దర్శనమిచ్చి తన ఉనికి ని చెప్తాడు అంటూ.. మోరియా దర్శనానికి తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు.. సాధువు పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. భగవంతుని స్వప్న సాక్షాత్కారం లభించిన ఆయనను మంగళమూర్తి మోరియా అంటూ స్తుతించడం ప్రారంభించారు..
ఆ సాధువు నిర్వహించిన ఉత్సవాలలో గణపతితో పాటు మోరియా కు కూడా జేజేలు మొదలుపెట్టారు.. అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవ నినాదాలు ఒక బాగమైపోయాయి.. అలా.. నాటి నుంచి గణపతి బప్పా మోరియా..అనే నినాదం నిర్విరామంగా… అప్రతిహతంగా వినబడుతూనే ఉంది.. గణనాథుని సేవలో తరించిన మోరియా గోసావి స్మృతి గా వినాయక ఉత్సవాలలో గణపతి బప్పా మోరియా అని మరాఠీ లో నినదించడం మొదలైంది.. అది ఆ ఒక్క ఆ ప్రాంతానికే కాకుండా భాష, భావ , వర్ణ, వర్గ, ప్రాంతాలకు అతీతంగా గణపతి వేడుక ఎక్కడ జరుగుతుందో అక్కడ ఈ నినాదం వినిపించడం ఆనవాయితీగా మారింది.. గణపతి బప్పా మోరియా.. మంగలమూర్తి మోరియా..