ధర్మ ప్రచారం లో భాగంగా టీటీడీ వితరణ
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందు ఆలయాలకు రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహలు, మైక్‌సెట్లు, గొడుగులను రాయితీపై అందిస్తుంది. వీటిని పొందాలనుకునే వారు కొన్ని మార్గాదర్శకాలను పాటించి నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపితే ఆయా దేవాలయ అవసరాలకు కావలసినవి టీటీడీ పంపిస్తుంది. రాతివిగ్రహాల విలువ వాటి కొలతల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్.సి., ఎస్.టి. భక్తులకు ఉచితంగా బి.సి.,ఇతరులభక్తులకు 75% రాయితీపై అందిస్తారు. అదే విధంగా పంచలోహ విగ్రహాల విలువ వాటి కొలతల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని కూడా ఎస్.సి., ఎస్.టి. వారికి 90% రాయితీ పై బి.సి.,ఇతరులకు 75% రాయితీ పై అందిస్తారు.
హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలకు మైక్‌సెట్లను కూడా రాయితీపై అందిస్తోంది. మైక్‌సెట్టును బి.సి., ఇతరులకు 50% రాయితీపై, ఎస్.సి., ఎస్.టి.లకు 90% రాయితీపై అందిస్తారు. నిబంధనలు పాటించి దరఖాస్తు చేసిన అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తరువాత ఒక ఆంప్లిఫయ్యర్ విత్ డివిడి ప్లేయర్, ఒక మైక్ విత్ కార్డ్, ఒక మైక్ స్టాండ్, రెండు పెద్ద స్పీకర్లు, ఒక చిన్న స్పీకర్, వంద మీటర్ల వైట్ వైర్, అన్నమయ్య సంకీర్తనల సీడీని టిటిడి అందిస్తుంది. ఉత్సవ గొడుగులను కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ 50 శాతం సబ్సిడీతో అందిస్తారు. రిజర్వేషన్ గల కులాలవారు సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వుంటుంది.. అన్ని రాయితీలు కావాలనుకున్న వారు ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ లేదా సంబంధిత తహశీల్దార్ వారి అనుమతి లేఖ, ఆలయ ఫొటో, దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధ్రువీకరణ పత్రము, ఆలయ నమూనా(ప్లాను) అందజేయాల్సి వుంటుంది.. .ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించాలి.