సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. అక్కడ ప్రతి చోట ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరుకొనసాగుతుంది. ఈ పోరాటంలో గత రెండు రోజుల్లో 200 లకు మందికిపైగా సామాన్యులు చనిపోయారు. అదే సమయంలో, 1,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణ కారణంగా అక్కడ ఉంటున్న భారతీయులు ఇప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. తమను కాపాడాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుడాన్‌లోని భారతీయులు దాదాపు 4,000 మంది ఉన్నారు. వీరిలో 1,200 మంది దశాబ్దాల క్రితం అక్కడ స్థిరపడ్డ వీరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపించింది. మిలటరీ నియంత పాలనపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో సూడాన్‌పై నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య పోరు ప్రారంభమైంది. అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సుడాన్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పరిసర ప్రాంతాలు కూడా దద్ధరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయులను మరోసారి భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎవరూ వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఖార్తూమ్ విమానాశ్రయ పరిసరాల్లో ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న కారణంగా దానికి సమీపంలోనే ఉన్న భారత దౌత్య కార్యాలయంలో ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేరని తెలిపింది. అయితే, రాయబార కార్యాలయం తెరిచే ఉందని సిబ్బంది మాత్రం వేర్వేరు చోట్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వివరించారు. భారతీయుల భద్రతే తమ ప్రాధాన్య అంశమని ఆయన స్పస్టం చేశారు. మరోవైపు, సూడాన్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ను కలిసి చర్చించారు. జైశంకర్ ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నారు. సూడాన్‌లో శాంతిభద్రతలు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
previous post
next post