జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేత, న్యాయ వ్యవస్థ లతోమొట్టికాయలు వేయించుకున్నప్పటికి మొండి పట్టుదలతో ముందుకెళ్ళి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఆ రాజప్రాసాదం లోకి ఈ రోజు ప్రజలు వెళ్లగలిగారు.. లోపలి దృశ్యం చూసిన మీడియా గాని ప్రజాలుగాని నోరెళ్ళ బెట్టారు.. అత్యాధునిక సామ్రాజ్యాన్ని చూసి చలించిపోయారు. ఎందుకు కట్టారో.. ఎవరికోసం నిర్మిస్తున్నారో కనీసం పత్రికలకు కూడా చెప్పకుండా ఒక్కొక్క మంత్రి ఒక్కో స్టేట్మెంట్ తో గందరగోళం రాజేసి అసలు విషయాన్ని మరుగున పడేసారు..
మొత్తం ఈ ప్రాంతమంతా నిషేధ ప్రాంతంగా అధికారులు వ్యవహరించారు.. ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ప్రెస్ ని వెంటేసుకుని లోపలికి వెళ్లడంతో ఆ ప్యాలెస్ వైభవం ప్రపంచానికి తేటతెల్లమైంది.. ప్యాలెస్ వ్యవహారం పై ప్రజల్లో చర్చ ప్రారంభం కావడంతో వైసిపి డిఫెన్స్ గేమ్ మొదలెట్టింది.. దాదాపు 450 కోట్ల ప్రజాధనంతో అత్యంత విలాసవంతం గా నిర్మించిన ప్యాలెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్లేట్ ఫిరాయించింది.. రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధులు వచ్చినప్పుడు విడిదిగా ఉండటానికి ఈ అతిధి గృహం అని ఎక్స్ వేదిక సన్నాయినొక్కులు మొదలెట్టింది.. ఇదే విషయాన్ని నిర్మాణ సమయంలో చెప్పివుంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదన్నది ఇప్పుడొస్తున్న ప్రశ్న..
ప్యాలెస్ ప్రారంభించిన రోజున టూరిజం శాఖ మంత్రి రోజా విశాఖను రాజధానిగా ప్రతిపాదించినందున ఈ భవనం సిఎం క్యాంపు కార్యాలయం కోసం ఉపయోగిస్తే మంచిది అని త్రిసభ్య కమిటీ సూచించిందని అయితే దీనిని భవిష్యత్తులో పర్యాటకం కోసం ఉపయోగించాలా లేక సిఎం కార్యాలయంగా ఉపయోగించాలా అనేది త్వరలో స్పష్టత ఇస్తామని వక్కాణించారు..రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధులకు విశాఖ లో భద్రతాపరంగా ఆధునికత పరంగా అతిథి గృహాలకు కరువు లేదు. ప్రభుత్వ గెస్ట్ హౌస్ లతో పాటు అతిపెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి.. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా గెస్ట్ హౌస్ ఉండాలి అని ప్రభుత్వం భావించడం లోను తప్పులేదు క్లారిటీ ఇవ్వకుండా అత్యంత రహస్యం గా నిర్మించడం పైనే అందరూ అభ్యంతరం చెప్పారు. కోర్టులకెక్కారు. ఇంత గొడవా జరిగాక ఏదోఒకటి చెప్పకపోతే బావుండదు అనే రీతి లో ఒక ట్వీట్ వదలడం విషయాన్ని మరింత పెద్దది చేసింది.. గుడ్డు మంత్రి చెప్పినట్టు ఋషులు తపస్సు చేయడం వల్లనే ఋషికొండ అని పేరొచ్చిన ఈ ప్రాంతం ప్రపంచానికి మళ్ళీ ఏదో చెప్పబోతుంది.. సీఎం క్యాంపు కార్యాలయం కావాల్సిన ప్యాలెస్ ఏం కాబోతోందో కాలం తొందరలోనే తేల్చేస్తుంది.