Vaisaakhi – Pakka Infotainment

స్పీడ్ పెంచేసిన ప్రతిపక్షాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు చాలా దూరం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎన్నికలే టార్గెట్ గా తమ స్పీడును పెంచాయి. ఎక్కువగా జనంతో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తూర్పారాబడుతున్నాయి. అలాగే వైసిపి నేతల వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తమ ఆందోళనలను ఉధృతం చేసాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుపైన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు బిజెపి కూడా తగ్గేది లేదు అంటూ జనంలోకి వస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ప్రజల పక్షాన ఉన్నామంటూ పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ మూడు పార్టీలు వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే కలివిడి గా కాకుండా విడివిడిగా జనం లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే టిడిపి అన్న క్యాంటీన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేకత, ఏర్పాటుచేసిన క్యాంటీన్లను అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి ప్రజలకు చేరువ కావాలని ఆలోచిస్తున్న టిడిపి ప్రయత్నాలను అడ్డుకోవడంలో వైసిపి ప్రభుత్వం సఫలం అయిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ తీరుతో భంగపడ్డ టిడిపి నేతలు ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కొడాలి నాని వ్యక్తిగత విమర్శల వ్యాఖ్యలపై మండి పడ్డ టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కోడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేయడమే కాకుండా పిండ ప్రదానాలు చేసి వినూత్న నిరసనలు చేస్తుంటే టిడిపి శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు. మొత్తానికి ఈ అంశాలపై ప్రజలు చర్చించుకునే విధంగా టిడిపి చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ఇక జనసేన కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగడుతున్నారు. ఈ ప్రభుత్వం వల్ల పేదలకు ఏమి ఒరిగేది లేదని విస్తృతంగా ప్రచారం చేసారు. కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇక బిజెపి నేతలు కూడా తాము ఉన్నామని తెలియడానికి పలు సమావేశాలలో, ప్రెస్ మీట్ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. అయితే ఈ మూడు పార్టీలు వివిధ వేదికలలో, వివిధ అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానంపై అధికార వైసిపి నేతలు స్పందించి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మేం కూడా తగ్గేది లేదు అన్నట్లు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఘాటుగానే సమాధానం చెబుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అధికార పార్టీ నేతల కంటే ప్రతిపక్ష పార్టీ నేతలు జనంలో ఎక్కువగా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అలాగే పార్టీ ఇతర కేడర్ ను ఎప్పుడు జనంలో ఉండాలని, వారికి మరింత చేరువ కావాలని ఆదేశించారు. కొందరు ఆ పార్టీ నేతలు మొదట్లో ప్రజల మధ్య ఉన్నప్పటికీ తర్వాత ప్రజాక్షేత్రంలో వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా తమ ప్రయత్నాలను మానుకున్నట్లు తెలుస్తుంది. కొన్నిచోట్ల వైసిపి నేతలపై ప్రజలు దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రజలు ప్రభుత్వం పై చాలా కోపంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడం, నిత్యవసర వస్తువుల ధరలు పెంచడం, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు పెంచడం, చెత్త పన్ను వేయడం, ప్రభుత్వ పథకాలలో కోత విధించడం వంటి చర్యలతో మింగుడు పడని జనం ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇవే అంశాలపై అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు గగ్గోలు పెడుతూ టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కూడా ఈ విషయాల పైనే వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరించకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంపై కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్ళేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ పని ప్రారంభించేసాయి కూడా. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గమనిస్తున్న అధికార పార్టీ తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. తాము చేసిన మంచి పనులను ప్రజాక్షేత్రంలో వినిపించేందుకు సిద్ధమవుతుంది. మూడు పార్టీలు ఏకమై తమపై పోటీ చేసినప్పటికీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసిపి పార్టీయే అని, ముఖ్యమంత్రిగా మళ్లీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేది జగన్ మోహన్ రెడ్డి యే అని వైసిపి నేతలు గట్టిగా చెబుతున్నారు. అయితే ఇంకా ఎన్నికలకు చాలా గడువు ఉండటంతో ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు పూర్తిగా మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫైనల్ గా ప్రజా తీర్పును ఏ పార్టీ అయినా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More