తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తను నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు. ప్రస్తుతం 70 ప్లస్ లోనూ పని విషయంలో ఆయన దూకుడు తగ్గలేదు. నిత్యం ప్రజల్లోకి వెళ్లాలి. వాళ్లతో ఉండాలనే తపన ఆయనది. అందుకే, జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి చంద్రబాబు పక్కా ప్లాన్ చేశారట. వచ్చే ఏడాది జరిగే మహానాడు వరకు నిరంతర పర్యటనలు ఉండేలా బ్లూ ప్రింట్ తయారు అయిందని తెలుస్తోంది. ఒంగోలు మహానాడు సూపర్ హిట్ కావడంతో జిల్లాల్లో మినీ మహానాడులను వచ్చే ఏడాది వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వారానికి మూడు రోజుల పాటు ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటన చేయనున్నారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లను చేర్చుకోవడం, పార్టీలోని అంతర్గత విభేదాలను సరిదిద్దడం, కనీసం 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మినీ మహానాడుల ద్వారా వైసీపీ చేపట్టిన సామాజిక భేరి యాత్రకు చెక్ పెట్టేలా స్కెచ్ వేశారు. ఇప్పటికే మినీ మహానాడులు విజయవంతం అయ్యాయని టీడీపీ సేకరించిన సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన చంద్రబాబు ఈసారి కడప జిల్లానూ వదలకుండా గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవల కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆయన నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. ఆయన కోసం జనం బారులు తీరిన తీరును గమనించిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తోంది. అధికారంలోకి సునాయాసంగా రావచ్చని అంచనా వేస్తోంది. ఇతర పార్టీల నుంచి సీనియర్లు రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ, యువతకు ప్రాధాన్యం ఇస్తోన్న లోకేష్ ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న సీనియర్లను హోల్డ్ చేస్తున్నారు. ఒక వేళ పార్టీలో సీనియర్లు చేరినప్పటికీ ఎన్నికల్లో సీటు గ్యారంటీ మాత్రం ఇవ్వడానికి లోకేష్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏడాది మొత్తం జిల్లాల పర్యటనల ద్వారా టెంపో క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్లాలని మాస్టర్ స్కెచ్ వేశారు. గతంలోనూ మీ కోసం యాత్ర ద్వారా 2009 ఎన్నికలకు, వస్తున్నామీకోసం యాత్ర ద్వారా 2014 ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు మినీ మహానాడుల్లో టెంపో క్రియేట్ చేసిన ఎన్నికలకు ఫేస్ చేయాలని బాబు మాస్టర్ స్కెచ్ వేశారు. ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
previous post
next post