విశాఖ వేదికగా రాజకీయ వేడి పుంజుకుంటుంది. నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు తగ్గేది లే అన్నట్లు భీష్మించి కూర్చుంటున్నారు. వరుస ప్రెస్ మీట్లతో ఆరోప ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకపక్క వైసిపి విశాఖ గర్జన పేరిట భారీ కార్యక్రమం చేపడుతుంటే, మరోపక్క జనసేన జనవాణి కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ రెండు కార్యక్రమాలు వరుసగా రావడంతో ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. తమకు పోటీగా కార్యక్రమాన్ని చేపట్టారని ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి హాజరు కానుండడంతో ఉత్తరాంధ్ర జనసేన పార్టీకి మరింత ఉత్సాహాన్ని పెంచినట్టయింది. విశాఖ వేదికగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కూడా భారీగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. మరొక వైసిపి చేపడుతున్న గర్జన ర్యాలీలో కూడా లక్షలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వైసిపి గర్జన కార్యక్రమం 15వ తారీఖున ఉదయం ప్రారంభం కాగా అదేరోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ రానున్నారు. ఆ సాయంత్రం ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. 16న భారీగా చేపట్టనున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తమ గర్జన కార్యక్రమానికి పూర్తిగా జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన తమ కార్యక్రమాన్ని వేరే రోజుకు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనసేన నేతలు అందుకు దీటుగా ఉన్న సమాధానం చెబుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే రాజ్యాంగబద్ధంగా ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహించ వచ్చునని జనసేన నేతలు చెప్తున్నారు. ఇలా కార్యక్రమాలు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనిపై వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టు మరి ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. అయితే జనసేన ఏం చేసినప్పటికీ కూడా తమ కార్యక్రమం భారీగా సక్సెస్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల కుయుక్తులు ఇక్కడ చెల్లవని అంటున్నారు. జనసేన పెట్టిన కార్యక్రమం కంటే వైసీపీ చేపడుతున్న గర్జన ర్యాలీకి ప్రజలు భారీగా తరలి వస్తారని పేర్కొంటున్నారు. ఇక్కడ వార్ వన్ సైడేనని జనసేన ఎన్ని డ్రామాలాడిన లాభం లేదని చెబుతున్నారు. 15న వైసీపీ చేపడుతున్న గర్జన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైసిపి సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. రెండు పార్టీల వరుస కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లు, ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలియజేయడంతో పోలీసులు ఎక్కడికక్కడ నిఘాను మరింతగా పెంచారు. పోలీసు భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు.
previous post
next post