Vaisaakhi – Pakka Infotainment

విశాఖ ఐటీ సిటీ కానుందా..… క్యూ కడుతున్న కంపెనీల మాటేమిటి..?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడిందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ సిలికాన్ వ్యాలీ విశాఖపై ఐటీ దిగ్గజ పరిశ్రమలు ఫోకస్ పెట్టాయి. ఇన్ఫోసిస్ తర్వాత హెచ్.సీ.ఎల్. సాగరతీరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. వ్యాపార విస్తరణకు ముందుకు రావడంతో ఐటీ కారిడార్ రూపకల్పనకు రెడీ అవుతోంది. మొన్న ఆదానీ డేటా సెంటర్…. నిన్న ఇన్ఫోసిస్… రేపు హెచ్.సి.ఎల్…ఇదీ స్మార్ట్ సిటీ విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్దం అవుతున్నాయి.. ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్‌ కొత్త క్యాంపస్‌ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్‌ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్‌ సొంత భవనం సమకూర్చుకునే వరకు అక్కడే నడుపుతారు. ఆరంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్‌ విశాఖ యూనిట్‌లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచనుంది. మరోవైపు ఇన్ఫోసిస్‌తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇప్పటికే మరో ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.14,634 కోట్లు వెచ్చిస్తోంది. కాగా విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More