ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు భారతీయ ఐటీ ఉద్యోగులు వారంలో కనీసం ఒక్కరోజైనా ఆఫీసుకు రావడం లేదని సీఐఈఎల్ హెచ్‌ఆర్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఒకవేళ గట్టిగా ఆదేశాలు ఇద్దామంటే ఎక్కడ ఉద్యోగం మానేస్తారేమోనని ఐ టీ సంస్థలు ఆలోచన లో పడ్డట్టు తెలిసింది. భారత్‌లోని టాప్-10 సహా 40 ఐటీ కంపెనీలను సీఐఈఎల్ సర్వే చేసింది. వీటిల్లో మొత్తం 9 లక్షల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది ఇంటి నుంచి లేదా నచ్చిన చోటు నుంచే పనిచేస్తుండటంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పరివర్తన మరింత ఆలస్యం అవుతోందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య మిశ్రా అంటున్నారు. ప్రస్తుతం సర్వే చేసిన కంపెనీల్లో 30 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నడుస్తున్నాయి. మిగిలినవి కొంతవరకు ఆఫీసుల్లోనే నడుస్తున్నాయి. మరికొన్ని త్వరలో ఉద్యోగులను పిలిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ‘టెక్నాలజీ కంపెనీల్లో ప్రతిభావంతులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉంది. పైగా రాజీనామా భయం వెంటాడుతోంది. ఫలితంగా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనేందుకు కంపెనీలు ఒత్తిడి చేయడం లేదు. నిదానంగా వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని మిశ్రా అన్నారు. దేశంలో దాదాపు 40 శాతం ఐటీ కంపెనీలు హైబ్రీడ్ పని విధానాన్నే అనుసరిస్తున్నాయి. వారంలో కనీసం 1-3 రోజులైనా ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్నాయి. అయితే 25 శాతం కన్నా తక్కువ మందే ఆఫీసులకు వస్తుండటాన్ని అవి గమనించాయి. 30 శాతంగా ఉన్న చిన్న కంపెనీలు మాత్రం వారంలో అన్ని రోజులూ ఆఫీసుకు రమ్మంటున్నాయి. తక్కువ వర్క్‌ఫోర్స్ ఉండటంతో ఎక్కువ సమన్వయం అవసరమని ఇలా చేస్తున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాయి. ‘గడచిన మూడేళ్ల కాలంలో ఉద్యోగులకు ఆఫీసుకు రాకుండానే కెరీర్ కొనసాగించడం అలవాటైంది. ఇంటి నుంచి లేదా నచ్చిన చోట నుంచి పనిచేస్తున్నారు. అందుకే విప్రోలో హైబ్రీడ్ విధానాన్నే అనుసరిస్తున్నాం’ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘టెక్ మహీంద్రాలో మేం వ్యాపారం కన్నా ఆరోగ్యానికే ప్రాముఖ్యం ఇస్తాం. ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు మేం అవకాశం ఇస్తున్నాం. హైబ్రీడ్ మోడల్ ఇంకా పెరగనుంది’ అని ఆ కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ అంటున్నారు.