వైజాగ్ లో ఆకతాయిలు మరింతగా రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అలజడులు సృష్టిస్తున్నారు. వీరి దౌర్జన్యాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా విశాఖలోని అల్లిపురం ప్రాంతంలో కొందరు ఆకతాయిలు ఆరు ద్విచక్ర వాహనాలను తగులబెట్టి విధ్వంసం సృష్టించారు. సుమారు ఐదు లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం ఈ దారుణానికి తెరలేపిందని భావిస్తున్నారు ఈ గొడవ ను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించిన స్థానిక పెద్దమనుషుల కుటుంబ సభ్యుల వాహనాలనే తగలబెట్టడం కలకలం రేపింది శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో ఒక ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లల్లో ఉన్న స్థానికులు భయంతో బయటకు పరుగులు తీసి ఏం జరిగిందని ఆతృతగా చూసిన వారికి అప్పటికే దగ్ధమై పోయిన నాలుగు బైక్ లు దర్శనమిచ్చాయి. మరో రెండు వాహనాలు పాక్షికంగా దగ్ధమవుతున్న దశ లో కనిపించాయి.. దానికి తోడు అక్కడే కరెంటు స్తంభం ఉండటం దాని పైన ఉన్న విద్యుత్ వైర్లు కూడా కాలిపోవడంతో ఆ ప్రాంతమంతా కరెంట్ పోయి అంధకారం లోకి వెళ్లి పోయింది. స్థానికుల అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇటువంటి ఘటన జరిగి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మరోసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు సీరియస్ గా పట్టించుకుని ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్న ఆకతాయిలఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు.
previous post