ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజరాజకీయ నేతలు నాయకత్వం వహించిన రెండాకుల పార్టీ చీలిక పిలికలతో అల్లడిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఓపిఎస్, ఈపీఎస్ లు రెండు వర్గాలు గా విడిపోయి రోడ్డున పడి కొట్టుకునే స్థితికి వచ్చారు. ఈ పోరాటం లో పళనిస్వామి దే పై చెయ్యి అయి తాత్కాలిక కార్యదర్శి గా ఎన్నికవడం ఒక ఎత్తైతే వెనువెంటనే పన్నీర్ సెల్వం ని పార్టీ నుంచి వెలివేయడం మరో ఎత్తు. జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారి ఒకరి నొకరు సస్పెండ్ చేసుకున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఒ.పన్నీర్‌సెల్వం అత్యంత విధేయుడు. అక్రమాస్తుల కేసుల్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు పన్నీర్‌సెల్వమ్‌నే సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. అలా 2001లో 2014లో రెండుసార్లు ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించారు 2016 కూడా జయలలిత చనిపోయినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి అయింది కూడా ఆయనే. ఇక 1987లో ఎంజీఆర్ చనిపోయిన తరువాత జయలలిత, జానకీ రామచంద్రన్ మధ్య పార్టీ చీలి పోయింది. నాడు జయలలితకు మద్దతుగా నిలిచారు పళనిస్వామి. అలా జయలలిత అభిమానం చూరగొంటూ మంత్రి స్థాయికి ఆయన ఎదిగారు. జయలలిత మరణం తరువాత పన్నీర్ కు జయలలిత నెచ్చెలి శశికళకు, మధ్య విభేదాలు బయటపడ్డాయి. శశికళను ముఖ్యమంత్రి చేసేందుకు తనను రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.ఆ తరువాత పార్టీలో విభేదాలు రావడం, శశికళ వర్గం పళనిస్వామిని పార్టీ లెజిస్లేచర్ నాయకునిగా ఎన్నుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత పన్నీర్‌సెల్వం రాజీనామా ముఖ్యమంత్రి పదవికి చేయాల్సి వచ్చింది. చివరకు శశికళ అండతో పళనిస్వామి సీఎం అయ్యారు. తరువాత పళని కూడా శశికళ కు హ్యాండ్ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా పార్టీలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య పోరు ఎక్కువ అయింది. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి పళనిస్వామి వర్గం మాత్రమే ఏక నాయకత్వం కోసం పట్టుపడుతూ వచ్చింది. కానీ పన్నీర్‌సెల్వం వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే జనరల్ బాడీ లో ఏక నాయకత్వం కావాలంటూ తీర్మానం చేయడం తో సమావేశం మధ్యలోనే పన్నీర్‌సెల్వం వెళ్లిపోయారు. పన్నీర్‌సెల్వం వర్గం కోర్టుకు వెళ్లినప్పటికి తీర్పు పళనిస్వామికే అనుకూలంగా వచ్చింది.అయితే చనిపోయే వరకు జయలలిత ఆ పదవిలో ఉన్నారు. ఆ తరువాత కూడా జయలలితనే శాశ్వత జనరల్ సెక్రటరీగా ఉంటారని పార్టీ చెబుతూ వచ్చింది. కానీ పళనిస్వామిని ఎన్నుకోవడం ద్వారా ఆ వైఖరి మారినట్లు అయింది. జయలలిత మరణం తరువాత పార్టీ దిక్కు కోల్పోయింది అయినా అదృశ్య ఆపన్న హస్తం అండదండలతో ఇంతవరకు నెట్టుకువచ్చిన రెండాకులపార్టీ మనుగడకు దేవుడే దిక్కు.
previous post