ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్న నేపధ్యం లో ఎన్నికల కమీషన్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్.వి.ఎం) ఓటింగ్ విధానం పై కసరత్తులు ప్రారంభించింది. సొంతూళ్లను విడిచి దూరంగా ఉన్న ఓటర్ల కోసం ఉన్న చోటునుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్(ఆర్‌ఈవీఎం)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఎన్నికల సమయంలో సొంత ఊళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఈసీ చెబుతోంది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌కు సంబంధించిన నమూనాను కూడా రూపొందించామని ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఓ కాన్సెప్ట్ నోట్‌ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపింది. ఒక పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎంను అభివృద్ధి చేశారు. ఈ నమూనా మెషిన్ ప్రదర్శన కోసం అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ వెల్లడించింది. రిమోట్ ఓటింగ్‌ను అమల్లోకి తెచ్చేముందు. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది. గతంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికల నిర్వహణ సమయంలో రిగ్గింగ్ కేసులు నమోదు అయ్యేవి ఆ తర్వాత ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలనే ఆలోచనతో ఈ.వి.ఎం లను ప్రవేశపెట్టారు. తొలి నాళ్లలో ఎటువంటి ఆరోపణలు రాకపోయినా రెండవసారి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ.వి.ఎం ల పని తీరుపై అనుమానాలు తలెత్తాయి. నోట్ల రద్దు, పెరిగిన ధరలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, పడిపోయిన సామాన్యుడి తలసరి ఆదాయం, వంటి ఎన్నో కారణాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదని సర్వే సంస్థలు డంకా బజాయించాయి. కానీ ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారయ్యాయి. ఎవరు ఊహించని విధంగా రెండోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కనీసం 50 నుంచి 70 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న టిడిపి కూడా బొక్క బోర్లా పడడం తో ఈ.వి.ఎం లను మ్యానేజ్ చేసి అధికారంలోకి వచ్చారని ప్రతిపక్షాలు ఇప్పటికీ సన్నాయి నొక్కుతూనే ఉన్నాయి. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆరోపణలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడంలో నిష్పక్షపాతంగా తన విధులను నిర్వర్తించడంలో ఫెయిల్ అవ్వడం వల్లే ఓడిపోవాల్సిన నేతలు ఈ.వి.ఎం లను అడ్డుపెట్టుకుని గెలిచారని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు ఉన్న సందర్భంలో అందరిని ఒప్పించి RVM లపై ముందుకు వెళ్లడం ఎలా సాధ్యం అన్నదానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ సంస్కరణలను తీసుకురావడంలో, ఎన్నికల కమిషన్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావటంలో తనదైన ముద్రవేశారు. ఓటర్ ఐడీ కార్డు, అనుమతి లేకుండా గోడలపై రాతలు, మైకులు వాడటంపై నిషేధం, ఎన్నికల్లో ఖర్చుకు పరిమితి విధించటం, మతపరమైన ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం పై నిషేధం, సంస్థాగత ఎన్నికలు నిర్వహించని పార్టీల గుర్తింపు రద్దు లాంటి సంస్కరణలతో ఎన్నికల విధానంలో కొంతమేరకు మార్పు వచ్చింది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్లు అమలు చేయగా మరి కొందరు నిబంధనలకు నీళ్ళోదిలారు. దేశంలో నానాటికి ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ అధ్యయనం చేసిన ఈసీ ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగానే రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్(ఆర్‌ఈవీఎం)ను అందుబాటులోకి తేస్తున్నట్లు ప్రకటిస్తోంది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి అంతర్గత వలసలే కారణమని అందుకే వేరేచోట వుండేవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునే రిమోట్ ఓటింగ్‌పై దృష్టి పెట్టామని తెలిపింది. ప్రజాస్వామ్య పండగలో మరింత మంది పాల్గొనేలా ఈ రిమోట్ ఓటింగ్ గొప్ప నాంది కాబోతోందని ప్రధాన ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అయితే ఈ విధానంలో కూడా అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. ఒక మంచి ఆలోచన చేసి దానిని అమలు చేయడానికి సిద్ధమవుతుండగా అధికార పార్టీలు మాత్రం ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణ లు బలంగానే వినిపిస్తున్నాయి ఈ.వి.ఎం మిషన్లనే మ్యానేజ్ చేసినోళ్లు ఈ ఆర్.వి.ఎం లను మ్యానేజ్ చేయలేరా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ స్వతంత్రగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ మరిన్ని కఠినమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఓటర్ల నమోదులో జరుగుతున్న అవకతవకలు, ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించి పెడుతున్న ఖర్చు, ఓటర్లకి పంచుతున్న మద్యం, డబ్బులను నియంత్రించడం, ప్రలోభాలను తగ్గించడం లాంటి విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పార్టీలు 5 వేలు చొప్పున ఓటర్లకు పంచిందని, ఆయా పార్టీలు ఇచ్చిన డబ్బులు తీసుకున్నామని ప్రచార మాధ్యమాల సాక్షిగా ప్రజలు చెప్పినా చర్యలు చేపట్టలేని దుస్థితి ఈసీది. స్వతంత్రంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఆర్.వి.ఎం విధానంపై వస్తున్న ఆరోపణల పై దృష్టి సారించి ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
previous post
next post