ప్లాస్టిక్ పర్యావరణ మనుగడకే కాదు ఇప్పుడు మానవ మనగడకు కూడా ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్ కి బదులు ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.. ప్రత్యేకించి ప్లాస్టిక్ సంచుల వినియోగం పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసి ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్న ప్రజలలో మార్పు అనేది కనిపించడం లేదు. మనకు తెలియకుండానే తాగే నీటిలో, తినే తిండిలో, పీల్చే గాలిలోనూ ప్లాస్టిక్ పరమాణువులు ఉండడంతో జీర్ణాశయం, మెదడు, గర్భసంచిలో ఉండే ఉమ్మునీరులోకి ప్లాస్టిక్ అవశేషాలు చేరిపోతున్నాయి. కాని, రక్తంలో ఇలాంటివి కనిపించడం మాత్రం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలతో పాటు ఇప్పుడు ప్లాస్టిక్ అవశేషాలు కూడా కనిపించడం మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ రక్తంలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు నెదర్లాండ్స్ సైంటిస్టులు. పరిశోధనలో భాగంగా మొత్తం 22 మంది వ్యక్తుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. వారిలో 17 మంది రక్తంలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు గనక మానవ శరీరంలోకి ప్రవేశిస్తే కణాల మరణం సంభవిస్తుందని, కణాల గోడలు దెబ్బతినడానికి, అలర్జిక్ రియాక్షన్లకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు పేగుల్లో వాపును, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్‌ను కలిగిస్తాయని నిర్ధారించారు. రక్తంలో ప్రవేశించిన ప్లాస్టిక్ కణాలు ఒకచోటే ఉంటాయా లేక రక్తం సరఫరా అయ్యే క్రమంలో వివిధ అవయవాలకు చేరుతాయా అనేది తేలాల్సి ఉంది. రక్తంలో చేరిన విషాల నుంచి మెదడును కాపాడేందుకు బ్లడ్-బ్రెయిన్ బ్యారియర్ వ్యవస్థ ఉంటుంది. దీన్ని కూడా అధిగమించి మెదడులోకి చేరుతాయా అనేది కూడా పరిశోధించాల్సి ఉందంటున్నారు సైంటిస్టులు. శాస్త్రవేత్తలు సేకరించిన 50 శాతం రక్త నమూనాల్లో పీఈటీ రకం మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్టు తేలింది. వీటినే పెట్ బాటిల్స్ అని పిలుచుకుంటాం. ఈ ప్లాస్టిక్‌తోనే వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ తయారవుతాయి. చివరికి ఫుడ్ ప్యాకేజింగ్‌కు కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్‌నే వినియోగిస్తుండడంతో చాలా ఈజీగా ప్లాస్టిక్ రక్తంలో చేరుతోందంటున్నారు. ఇక 36 శాతం నమూనాల్లో ప్యాకేజింగ్, స్టోరేజీకి వాడే పాలిస్టరీన్ అవశేషాలు, 23 శాతం నమూనాల్లో క్యారీబాగుల తయారీలో వాడే పాలీ ఇథలీన్ అవశేషాలు కనిపించాయి. మనుషులు వారానికి కనీసం ఒక టేబుల్ స్పూన్ ప్లాస్టిక్ అవశేషాలు తెలియకుండానే తింటున్నారని శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంటే నెలకు 21 గ్రాముల ప్లాస్టిక్, ఆరు నెలలకు 125 గ్రాములు, ఏడాదికి పావుకిలో, పదేళ్లకు రెండున్నర కిలోలు, జీవితకాలంలో 20 కిలోల ప్లాస్టిక్‌ను తెలియకుండానే తినేస్తున్నామని చెబుతున్నారు.
previous post
next post