చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆసియా దేశాల్లో ఆ శకలాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా భారత్ లో పడే అవకాశాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేసారు. దీంతో ఇతర దేశాలతో పాటు భారత్ కూడా ఆందోళన పడింది. అయితే ఎట్టకేలకు ఆ భారీ రాకెట్ శకలాలు భూమ్మీదకు చొచ్చుకు వచ్చాయి. అన్ని దేశాల్లో భయోందోళన మొదలైంది. అదే పడే ప్రాంతాన్ని బట్టి విధ్వంసం స్థాయి ఉంటుందని భారీ ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని అంచనాలు వేశారు. కానీ ఆ రాకెట్ శకలాలు సురక్షిత ప్రాంతంలోనే పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్ శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది. చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దక్షిణ మధ్య పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్లు అమెరికా స్పేస్ కమాండ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇదే రాకెట్‌కు చెందిన మరో శకలం ఉదయం 4:06 గంటల సమయంలో ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో పడిపోయినట్లు ట్వీట్ చేసింది. అవి సముద్రంలో పడిపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. స్పేస్‌లో న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా చైనా చివరి మాడ్యూల్‌ను భూమి నుంచి పంపించింది. చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. 23 టన్నులు బరువున్న రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్‌కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను దీని ద్వారా పంపారు. అయితే, ఈ రాకెట్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ వ్యోమనౌక భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. శకలాలు ఎక్కడ పడతాయోనని పలు దేశాలు భయాందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అవి సురక్షితంగా పసఫిక్ మహాసముద్రంలో పడ్డాయి. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది.