చైనా స్పై షిప్ శ్రీలంక రాకుండా ఉండేందుకు భారత్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొదట్లో భారత్ అభ్యర్థనను మన్నించి చైనా షిప్ ను తమ దేశానికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని శ్రీలంక చెప్పింది. చేసిన సాయాన్ని కూడా మరచిపోయింది.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. శ్రీలంక పై భారత్ పెత్తనం చేస్తూ ఉండటంపై మరో పక్క చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న తమను కాదని భారత్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై చైనా మండిపడింది. ఇక చేసేది లేక చైనా ఒత్తిడి వలన ఆ దేశానికి చెందిన స్పైస్ షిప్ తమ దేశానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది శ్రీలంక. ఉన్నతస్థాయి పరిశోధక నౌక గా పరిగణిస్తున్న చైనా వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి చేరుకుంది. స్పై షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు ఆ దేశ హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా తెలిపారు. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ఆలోచనతోనే స్పై షిప్ శ్రీలంకకు తరలించాలని చైనా ప్రయత్నిస్తుందని ఇటీవలే భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే శ్రీలంక మాత్రం చైనా ఒత్తిడికి తలొగ్గి అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. భారత్ లేవనెత్తిన ఆరోపణపై అటు చైనా కూడా స్పందించింది. సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా చూడాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ కోరారు.