అంతకంతకు భారీగా పెరుగుతున్న ఓ సింక్ హోల్ పై ఇప్పుడు ప్రపంచ దృష్టి పడింది.మిస్టీరియస్ సింక్ హోల్ గా చాలామంది అభివర్ణిస్తున్న దీనిని చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవడమే కాకుండా భయపడుతున్నారు కూడా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా బాగానే వైరల్ అవుతున్నాయి. అంత భారీ స్థాయిలో ఆ సింక్ హోల్ ఎలా ఏర్పడిందన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఉత్తర చిలీలోని టియెర్రా అమరిల్లా కమ్యూన్‌లోని కేటర్ అటాకామా ప్రాంతంలోని విస్తారమైన భూభాగంలో 25 మీటర్లు అంటే సుమారు 82 అడుగులు వెడల్పు, 200 మీటర్ల అంటే సుమారు 656 అడుగులు లోతున ఏర్పడిన ఈ సింక్‌హోల్ నిరంతరం పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతకంతకు ఈ సింక్ హోల్ పరిమాణం పెరగడంతో ముందు ముందు ఈ సింక్ హోల్ వలన ఏదైనా పెను ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ (సెర్నాజియోమిన్) డ్రోన్‌ల ద్వారా పరిశీలించిన పరిశోధకులు 82 అడుగుల భారీ వ్యాసాన్ని కలిగి ఉందని తేల్చారు. ‘ఇది దాదాపు 200 మీటర్ల లోతున ఉందని, అక్కడ ఎటువంటి మెటీరియల్స్ గుర్తించలేదని తెలిపారు. కానీ చాలావరకు నీటి ఉనికిని గుర్తించామని సెర్నాజియోమిన్ డైరెక్టర్ డేవిడ్ మోంటెనెగ్రో చెప్పారు. దీనిపై సంబంధిత అధికారుల వివరణలు ఎలా ఉన్నప్పటికీ సమీప ప్రాంతాల ప్రజలు మాత్రం పరిమాణం పెరుగుతూ ఉండడం పై ఆందోళన చెందుతున్నారు. అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏది లేనప్పటికీ సమీప భవిష్యత్తులో మరేదైనా ప్రమాదం జరగవచ్చనే భయంతో ఇక్కడి ప్రజలు ఉంటే మరోపక్క స్థానిక అధికారులు మాత్రం సాధారణంగా భూగర్భంలో జరిగే మార్పుల వల్ల ఇలాంటి సింక్‌హోల్స్ ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ ప్రాంతం స్థిరంగా ఉందని, తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావాలు చూపలేదని స్థానిక కెనడియన్ కంపెనీకి తెలిపింది. ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం కలగనప్పటికీ, మైనింగ్ నిక్షేపాల కోసం భూగర్భ పనులు విస్తారంగా జరుగుతున్నందునే ఇక్కడ సింక్‌హోల్స్ ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికి సమీప ప్రాంత ప్రజలు మాత్రం ఈ సింక్ హోల్ పై ఆందోళనను మాత్రం వదలడం లేదు.
previous post
next post