ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో గత కొన్ని రోజులుగా ఓ పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయపెడుతుంది. ఎప్పుడు ఒక చోట ఉండకుండా అలా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పలు జిల్లాలలో గల అటవీ ప్రాంతాలను చుట్టేస్తుంది. ఈ క్రమంలో కొన్ని పశువులను కూడా చంపి తిన్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి ఆ పెద్దపులి కనిపించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ పులి అటవీ ప్రాంతాల్లోనే కాక జనావాస ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ఊరు మీద పడి ఎవరిని చంపి తింటుందా అనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బికిబిక్కుమంటున్నారు. పులి సంచారం పై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అది సంచరించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో జల్లెడ పడుతున్నారు. కానీ ఆ పులి వారికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుంది. ఆ పులి ఎక్కడెక్కడ సంచరిస్తుంది అనే వివరాలు తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతాలలో దానిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పులి ఉన్నచోట ఉండకుండా అలా తిరుగుతూ ఉండటంతో అధికారులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కకుండా తప్పించుకుంటుంది. ఇప్పుడా పెద్ద పులి అనకాపల్లి జిల్లాకు చేరింది. కోటవురట్ల మండలం, టి.జగ్గపేట శివారు శ్రీరాంపురంలో అక్కడ చిన్న అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి బయలుదేరిన అటవీ శాఖ అధికారులు. ఆ ప్రాంతాలలో పులి పాద ముద్రలను గుర్తించారు. దీంతో అక్కడ స్థానికులు పులి సంచారంతో భయాందోళన చెందుతున్నారు. నెలన్నర క్రితం ఒడిశా నుండి సాలూరు మీదుగా ఆంధ్ర లోకి ప్రవేశించిన పెద్ద పులి అల్లూరి జిల్లా లోను సంచరిస్తూ అక్కడి వారికి నిద్ర లేకుండా చేసింది. పులి సంచారం తో మన్యం లో టెన్షన్ వాతావరణం మొదలైంది. దీంతో ఇళ్ల నుండి ప్రజలెవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ సమయంలో కూడా పులి కోసం అటవీ ప్రాంతం అంతా అధికారులు జల్లెడ పట్టారు ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవలే కాలంలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు శివారు ప్రాంతాల్లో 25 కు పైగా ఆవులు,గేదల పై పెద్ద పులి పంజా విసిరింది. అక్కడ కూడా దీని ఆచూకీ కోసం ప్రయత్నించిన అక్కడి అధికారులకు దొరకకుండా తన మకాం మార్చింది. కొంత కాలం విజయనగరం జిల్లాలో కూడా పెద్ద పులి గాండ్రింపులు మొదలెట్టింది. అక్కడి వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసింది. చివరకు అల్లూరి జిల్లా లోకి ప్రవేశించింది. అక్కడ చిలకల గెడ్డ పరిసర ప్రాంతం లో మరో గేద పై దాడి చేసింది. మరో దాడిలో అవుకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపులి ఇలా రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలను కవర్ చేసుకుంటూ వెళ్తూ తనకు దొరికిన జంతువులను చంపుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అది అనకాపల్లి జిల్లా చేరి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పుడు ఆ పులి అక్కడ నుంచి మరో చోట కు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అది ఉన్న చోట ఉండకుండా అలా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటం వలన దానిని పట్టుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. పులి సంచరించే ప్రాంతాలలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
previous post
next post