ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. తమ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇక్కడ అధికార పక్షం వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి మధ్య పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వీరిద్దరికీ గట్టి పోటీ ఇచ్చేందుకు జనసేన కూడా ముందు ఉంది. అయితే ఇక్కడ వైసిపి నేతలు ఎవరితో పొత్తు ఉన్న లేకపోయినా సరే తమ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని రెండోసారి కూడా అధికారం చేపడతామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క టిడిపి కూడా ఈసారి తామే అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతుంది. మరోపక్క జనసేన కూడా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ గట్టిగా నమ్ముతుంది. పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ మూడు పార్టీల ఆలోచన ఒకటే ఎవరికి వారు అధికారంలోకి రావాలనుకోవడం, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనుకోవడం. ప్రస్తుతం ఇదే కాన్సెప్ట్ తో ఆ మూడు పార్టీలు వెళుతున్నాయి. అయితే ఇక్కడ టిడిపి గెలుపు పై ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ ఒంటరిగా బరిలోకి దిగి వైసీపీని ఎదుర్కోవడం అన్నది అసాధ్యమని స్పష్టం అవుతుంది. అలాగే జనసేన కూడా ఒంటరిగా పోటీలోకి దిగిన లేదా బీజేపీతో జత కలిసి పోటీ చేసిన సరే చాలా పట్టిష్టంగా ఉన్న వైసీపీ ఎదుర్కోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన అయితే కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ టిడిపితో అయితే వెళ్లేది లేదని ఆ పార్టీ ఖరాఖండిగా చెబుతుంది. ఇటీవల వైజాగ్ పవన్ కళ్యాణ్ పర్యటనను వైసిపి అధికార పార్టీ అడ్డుకుని , మంత్రులపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పలువురు జనసేన నేతలను అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయ అంశంగా మారింది. అనంతరం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను కలిసి పరామర్శించడం జరిగింది. ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును ఖండించడం జరిగింది. టిడిపితో కలిసేది లేదని చెబుతున్న బిజెపికి మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా ఒకేసారి మీడియా ముందుకు వచ్చి రావడం బిజెపికి మింగుడు పడటం లేదు. గత ఎన్నికలలో బిజెపిని, నరేంద్ర మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడుకి దూరంగా ఉండేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మీడియా వాళ్ళు టిడిపితో పొత్తు కోసం అడిగితే గత ఎన్నికల్లో జరిగిన సంఘటన గుర్తు చేస్తూ టిడిపిని విమర్శిస్తున్నారు. జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి తో ఆ ఆలోచన మాకు లేదని చెబుతున్నారు. బిజెపి ఏపి వ్యవహారాల కో ఇంచార్జ్ సునీల్ దేవధర్ పొత్తులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోమని, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. టిడిపి కుటుంబ అవినీతి పార్టీ అని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోమనిస్పష్టం చేశారు. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని, చేదు అనుభవాలు చవి చూశామని అనాురు. ఏపిలో జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు.అలాగే పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్డు మ్యాప్ అంశంపై తాము అంతర్గతంగా చర్చించుకుంటామని చెప్పారు. రోడ్డు మ్యాప్ పై మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు,కన్నా లక్ష్మి నారాయణల మధ్య ఎలాంటి విభేదాలేవని అన్నారు. పార్టీలో అందరూ ఐక్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో బిజెపి టిడిపి తో ఎట్టి పరిస్థితులలో కలిసి పోటీ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఓటు బ్యాంకు చీలకూడదని గట్టిగా చెబుతున్న పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి వెళ్తే ఓట్లు చీలే అవకాశాలు మరి ఎక్కువగా ఉన్నాయి. అది వైసిపికి లాబించే అంశమనే చెప్పాలి. జనసేన బీజేపీతో కలిసి వెళితే సుమారు 20 నుంచి 30 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతో పటిష్టంగా ఉన్న వైసీపీని జనసేన ఎదుర్కొని అధికారం చేపట్టడం అన్నది అసాధ్యమని అంటున్నారు. అయితే పొత్తులకు సంబంధించి బిజెపి తప్ప టిడిపి, జనసేన ఎక్కడ మాట్లాడటం లేదు. ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చేసరికి రాజకీయాలలో ఊహించనవి ఏవైనా జరగొచ్చు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
previous post
next post