Vaisaakhi – Pakka Infotainment

ప్రపంచానికి శ్రీలంక ఇస్తున్న సందేశమేంటి..?

ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అరాచకం గా రూపం మార్చుకుని పాలకుల పారిపోయేలా చేసింది. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టింది. మరో పదేళ్ల వరకు ఈ సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. ముందు చూపు లేకుండా ప్రభుత్వాలు ప్రజలను కేవలం ఓటు బ్యాంకు గా మార్చుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో సాక్ష్యాలతో సహా ప్రపంచానికి చూపిస్తోంది. నిత్యవసరాలైన ఆహారం, ఇంధనం, మందులు అందుబాటులో లేక పోవడంతో ప్రజలు కట్టుదాటేశారు దేశాధ్యక్షుడి నివాసంపై దాడి చేశారు. ప్రధాన మంత్రి ప్రైవేట్ ఇంటిని తగులబెట్టారు. అక్కడ ఏర్పడిన సంక్షోభం రాత్రికి రాత్రే పరిష్కరించలేని దిశ కు టర్న్ తీసుకుంది. తప్పుడు విధానాలతో రాజకీయ నాయకులు దేశ ప్రయోజనాలను దెబ్బ తీశారనే అభిప్రాయం అక్కడి ప్రజలలో బలంగా నాటుకుపోయింది. తమ భవిష్యత్తును నాశనం చేశారని, అవినీతితో దేశాన్ని లూటీ చేశారని జనం రగిలిపోతున్నారు ఇక్కడ రోజురోజుకు పరిస్థితులు చేయి దాటిపోతూ ఉండటంతో సైన్యం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. ఇక ముందు ముందు మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు…ఉపాధి లేక వీధిని పడ్డ జనం నిత్యావసరాల కోసం తాగునీరు, పెట్రోల్, డీజిల్ కోసం క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన దయనీయ స్థితి కి వచ్చేసారు కొంతమంది ఆకలితో చనిపోతుంటే మరి కొంతమంది దీర్ఘకాల వ్యాధుల బారిన పడి మందులు సైతం అందుబాటులో లేక చనిపోడానికి ప్రభుత్వ విధానాలే కారణమని రగిలిపోతున్నారు ఉచితాలు అందిస్తున్న వరకు అందుకున్న ఆ ప్రజలే ప్రభుత్వ పెద్దలపై తిరుగుబాటు చేసే పరిస్ధితి దాపురించింది. దాడులు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వనేతలు ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొన్నేళ్ల వరకు ఎంతో పటిష్టంగా ఉన్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూడంతో ఆ దేశ పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితులకు కారణం చూస్తే చాలా విషయాలు సుస్పష్టమవుతున్నాయి. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కొత్త పరిశ్రమలు, డిజిటల్‌ సేవల వైపు వెళ్ళక పోవడం. బాంబుదాడులు, కొవిడ్‌ కల్లోలం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చాయి. పన్నులు తగ్గించడం, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల దిగుమతిపై నిషేధం, ఫలితంగా ఆహారోత్పత్తుల దిగుబడి తగ్గడం వంటి పరిణామాలు వినాశకరంగా మారాయి. శ్రీలంక తన అవసరాలకు తగ్గట్లుగా కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం చైనా నిర్ణయాలతోనే శ్రీలంకకు ఈ పరిస్థితి ఎదురైందని కథనాలు ప్రచురించాయి. బ్రిటీష్ నుంచి సిలోన్‌ స్వాత్రంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ చాలా వరకు వాణిజ్యం బ్రిటిష్, ఇతర యూరోపియన్ వ్యాపార సంస్థల నియంత్రణలోనే ఉంది. దాదాపు 40,000ల మంది కంటే ఎక్కువ మంది యూరోపియన్లు వ్యాపారం చేస్తూ ఈ ద్వీపంలోనే నివసించేవారు. ఆ పరిస్థితుల్లో సిలోన్ రూపాయి బలంగా ఉంది. చాలా దేశాల్లోనూ ఆమోదం పొందింది. అనంతరం ప్రధాన మంత్రి సిరిమావో బండారునాయకే తీసుకొచ్చిన సింహళ ఓన్లీ పాలసీతో అన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కటిగా తరలిపోయాయి. 1970ల నాటి జెవిపి తిరుగుబాటు కూడా కష్టాలకు తోడైంది. 1977లో బండారునాయకే సోషలిజాన్ని వ్యతిరేకించి ఓపెన్ మార్కెట్ ఎకానమీని స్వీకరించింది. దక్షిణాసియాలో ఆర్థిక సరళీకరణను స్వీకరించిన మొదటి దేశంగా శ్రీలంక అవతరించింది. కానీ 25 ఏళ్లుగా సాగిన తమిళ ఈలం అంతర్యుద్ధం విదేశీ పెట్టుబడిదారులను అడ్డుకుంది. తిరుగుబాటుదారులతో పోరాడడంలో నిమగ్నమై ఉన్న శ్రీలంక ప్రభుత్వం కూడా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టలేదు.  విదేశాల్లో పనిచేస్తున్న శ్రీలంక వాసులు ఏటా 3 నుంచి 4 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపుతున్నారు. పర్యాటకంపై ఆధారపడి 3 మిలియన్లకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సంవత్సరానికి 4 నుంచి 5 బిలియన్ డాలర్ల ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది. దేశంలో ఉత్పత్తి, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2009 తర్వాత కొద్దికాలం శ్రీలంక భారీ ఆర్థిక వృద్ధిని సాధించింది. విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆశలను పెంచింది. కానీ బిలియన్ల డాలర్ల విలువైన సావరిన్ బాండ్ల జారీలో నిర్లక్ష్యం, రుణాలు, వృథా ఖర్చులతో 10 సంవత్సరాలలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి భారీ రుణాలు తీసుకోవడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది.. ఇదిలావుండగా శ్రీలంక సంక్షోభం కారణంగా ఉపాధి లేక మత్స్యకారులందరూ భారత్ తీరం వైపు అక్రమంగా తరలించడానికి సిద్దపడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ లోకి భారీగా తరలిపొతున్నారని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.. అంతేకాకుండా సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ నూ అప్రమత్తం చేసింది. అదేవిధంగా లంకవాసులు ఎక్కువగా తమిళనాడులోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ తీర ప్రాంతానికి అక్రమంగా వలస వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టెర్రరిజం, హింస మళ్లీ తెరపైకి రావచ్చన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటిపై గమనిస్తున్న మన దేశ భద్ర ఏజెన్సీలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. ఎల్‌టీటీఈతో సంబంధాలున్న వేర్పాటువాదులు ఇదే అదనుగా, మళ్లీ ఓ గ్రూపుగా ఏర్పడటానికి సమాయత్తమవుతున్నారని ఇటీవల కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే శ్రీలంకలో టెర్రరిజం, హింసావాదం మళ్లీ పెచ్చరిల్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే సింహళీయులు, తమిళజాతుల మధ్య విభేదాలు తీవ్రంగా పెంచి పోషించే ప్రమాదం ఉందంటున్నారు. ఈ పర్యవసానాల పై భారత్‌ కూడా సునిశితంగా గమనిస్తూనే ఉంది.దేశాన్ని నాశనం చేసి, భావి తరాలు జీవించే అవకాశం లేకుండా చేయొద్దని వేడుకుంటున్నారు. ప్రపంచానికోక గుణపాఠం చెప్తున్న శ్రీలంక లో సాధారణపరిస్థితులు నెలకోనాలని కోరుకోవడం తప్పా చేసేదేం లేదు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More