ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని మూడు శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు.. కేవలం మూడు శాతం తో ప్రధాని అయ్యే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ మరో ప్రధాని అభ్యర్థి ప్రియాంక గాంధీ (2శాతం)కన్నా ముందంజ లో ఉండడంతో టీఆరెస్ శ్రేణుల్లో కేసీఆర్ ప్రధాని అయిపోయినంత సంబురపడుతున్నారు. ఓవరాల్ గా దేశవ్యాప్త సర్వే లో స్థానం దక్కినందుకు ఫుల్ ఖుషి లో వున్నారు. జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తి చూపుతుండడంతో.. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్‌లో ప్రధానిగా ఆదరణ కేటగిరీలో ఆయన పేరును కూడా చేర్చింది. అయితే.. 48% స్కోర్‌తో ప్రధాని మోదీ ఈ కేటగిరీలో ముందంజలో ఉన్నారు. 11% ఓట్లతో రాహుల్‌గాంధీ.. ఆ తర్వాతి స్థానాల్లో మమతాబెనర్జీ(8%), సోనియాగాంధీ(7%), మాయావతి(6%), శరద్ పవార్(6%), కేజ్రీవాల్(5%), నితిశ్‌కుమార్(4%), కేసీఆర్(3%), ప్రియాంక గాంధీ(2%) ఉన్నారు. ఏపీలో ఎన్డీయే, యూపీఏలకు మాత్రం మొండిచెయ్యి ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆరింటిని కైవసం చేసుకుంటుందని, కాంగ్రె్‌సకు రెండు స్థానాలు దక్కుతాయని ఈ ఫలితాలు వెల్లడించాయి. అధికార టీఆర్‌ఎస్, దాని మిత్రపక్షం మజ్లీస్ కు కలిపి 9 లోక్‌సభ సీట్లు దక్కుతాయని వివరించాయి. ఓట్లశాతం విషయంలో టీఆర్‌ఎస్ కంటే.. బీజేపీ చాలా ముందంజలో ఉండే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. 2019లో 42% ఓట్లను సాధించిన టీఆర్‌ఎస్ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. 34% వచ్చే అవకాశాలున్నాయని.. అదే సమయంలో 2019లో 20% ఓట్లు సాధించిన బీజేపీ 39శాతానికి ఎగబాకే అవకాశాలున్నాయని వెల్లడించాయి. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ చేపడుతున్న ‘ఆపరేషన్ దక్షిణాది’ విజయవంతమవుతుందా? దక్షిణాది రాష్ట్రాల్లో కమలదళాన్ని ఓటర్లు ఆదరిస్తారా? ఈ ప్రశ్నలకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కమల వికాసం ఉండకపోవచ్చని.. ఇప్పటికే పాగా వేసిన కర్ణాటకతోపాటు.. తెలంగాణలో బలాన్ని, సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చని ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ద నేషన్’ పేరుతో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కు గానీ లోక్‌సభ ఎన్నికల్లో మొండిచేయి తప్పదని, ఆ పార్టీలు ఇక్కడ ఖాతాలను తెరవలేవని ఒపీనియన్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి. తమిళనాట యూపీఏ నేతృత్వంలోని డీఎంకేకు 39కి గాను 38 సీట్లు వస్తాయని, కేరళలో అసలు జాతీయ పార్టీలకు ఆదరణ లేదని వివరించాయి. ఇక దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఎన్డీయేకు 362 లోక్‌సభ స్థానాలు, యూపీఏకు 97, ఇతరులకు 84 సీట్లు దక్కుతాయని వివరించింది.
previous post
next post