Vaisaakhi – Pakka Infotainment

పొత్తుల్లేవ్.. సింగిల్ గానే బరిలోకి టీడీపీ..?

రాజ‌కీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభ‌వం ఉన్న చంద్రబాబు వేసే అడుగుల్ని చివ‌రి నిమిషం వ‌ర‌కు అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. అలాంటి అనుభ‌వ‌జ్ఞుడుతో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు అంటూ మైండ్ గేమ్ ఆడిన జ‌న‌సేనకు . తాజాగా చంద్ర‌బాబు రాజంపేట లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి కౌంటర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ జనసేనకు టీడీపీ కి పొత్తు ఖాయం అనుకుంటున్న తరుణంలో బాబు తీసుకున్న నిర్ణయం చర్చ కు దారి తీసింది. మినీ మ‌హానాడులు సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు కూడా అధినేత గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్ స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను సిద్ధం చేసిన చంద్ర‌బాబునాయుడు ఈసారి పొత్తుల్లేకుండా వెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తు కొన‌సాగిస్తోన్న జ‌న‌సేన ఇటీవ‌ల పొత్తు ఆప్ష‌న్ల‌ను తీసుకుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన పవన్ కళ్యాణ్. అందుకోసం బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంద‌ని, దాన్ని అనుస‌రించి వెళ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత ప్ర‌జ‌ల‌తో మాత్ర‌మే పొత్తు అంటూ ముక్తాయించారు. అంటే, బీజేపీ కూడా జ‌న‌సేన పార్టీని వ‌దిలించుకుని ప‌నిలో ఉంద‌ని అర్థం అవుతోంది. అందుకు బ‌లంచేకూరేలా అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా వేదిక‌పై చిరంజీవి క‌నిపించ‌డం ప‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు, అనేక అపోహలకు తావిస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పొత్తుల గురించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ టీడీపీ లీడ‌ర్లు మాత్రం మౌనంగానే ఉంటు ప‌రిస్థితుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తున్నారు. ఓట్ల చీలిక అంశాన్ని కూడా అధ్య‌య‌నం చేస్తున్నారు. వాస్త‌వంగా జ‌న‌సేన‌కు సామాజిక‌వ‌ర్గం ఓట్లు మాత్ర‌మే కొంత మేర‌కు ఉన్నాయ‌ని గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలైన ఓట్ల ఆధారంగా అర్థం అవుతోంది. ఆ కోణం నుంచి అధ్య‌య‌నం చేస్తోన్న టీడీపీ రాబోవు రోజుల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌నే భావ‌న‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అందుకే, తాజాగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించడానికి చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డ్డార‌ని టీడీపీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ఇటీవ‌ల జ‌న‌సేన కోరుకుంటోన్న నియోజ‌క‌వ‌ర్గాల జాబితా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ జాబితాలో రాజంపేట కూడా ఉంది. అంతేకాదు, మ‌రో 50స్థానాల పేర్ల‌ను కూడా సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ తిప్పింది. వాటిని కొంద‌రు కోవ‌ర్టులు తిప్పుతోన్న జాబితాగా తొలుత భావించారు. కానీ, టీవీ చ‌ర్చా వేదిక‌ల్లో జ‌న‌సేన నేత‌లు పెడుతోన్న డిమాండ్ల‌ను విన్న తరువాత మౌనంగా టీడీపీ దూరం జ‌రిగింది. పొత్తు లేకుండా 2024 ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స్థిర‌మైన నిర్ణ‌యాన్ని పార్టీ అంత‌ర్గ‌తంగా తీసుకుంద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే రాజంపేట లోక్ స‌భ అభ్యర్థిగా గంటా న‌ర‌హ‌రిని ప్ర‌క‌టించ‌డంతో పాటు చిత్తూరు, అన్న‌మ‌య్య జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కొంద‌రికి అభ్య‌ర్థిత్వాల‌కు సంకేతాలు ఇచ్చార‌ని సమాచారం. ప్రస్తుత టీడీపీ మూడ్ ని గమనిస్తే ఒంటరి పోరాటానికే దాదాపు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More