ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైఖరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని పార్టీలకూ భారతీయ జనతా పార్టీ కీలకంగా మారింది. వైఎస్ఆర్‌సీపీ బీజేపీ రహస్య చూపులను యధాతధంగా కోరుకుంటోంది. తెలుగుదేశం పార్టీ .. బీజేపీతో పొత్తు నుంచి విడిపోయి నష్టపోయామన్న అభిప్రాయంతో ఉంది. అందుకే నోరు మెదపడం లేదు. అదే సమయంలో జనసేన పార్టీ అడిగి మరీ బీజేపీతో పొత్తులోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండటమే అడ్వాంటేజ్ కాదు .. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో శరవేగంగా ఎదుగుతున్న వైనం కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. కానీ ఏపీలో ఎందుకు బీజేపీ మాత్రం అనుకున్న స్థాయిలో ఎదగడం లేదు. సరైన నాయకత్వాన్ని కేంద్ర పెద్దలు ఇవ్వకపోవడమేనా ? అన్న ప్రశ్న సహజం గానే వినిపిస్తుంది.. రాష్ట్రంలో ఒకప్పుడు బలంగానే ఉండే బీజేపీ కేంద్ర రాజకీయాల కోసం పెట్టుకున్న పొత్తుల వల్ల ఎదుగుదల ఆగిపోయిందని చెప్పడానికి పెద్ద విశ్లేషణలు అవసరం లేదు. గతంలో ఆ పార్టీకి బలమైన స్థానాల్లో పోటీ చేస్తే.. పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా మూడో స్థానం లభించేది. పొత్తులు వికటించిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తోంది. ఎంత మంది బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్న నేతలు ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎందుకు బీజేపీ సొంతంగా బలపడలేకపోతోంది ? అనేది మిస్టరీగానే మిగిలింది. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో మొదటి నుంచి బలంగా ఉంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు .. తెలంగాణలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. టీడీపీతో పొత్తు లేనప్పుడు ఇంకా దారుణంగా పరాజయం చూడాల్సి వచ్చింది. అది మూడేళ్ల కిందటి మాట. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పోటీ పడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ వంటి కంచుకోటల్ని బద్దలు కొట్టి.. ఇక అధికారమే తరువాయన్నట్లుగా దూసుకెళ్తోంది. ఇక తమిళనాడులోనూ ఆ పార్టీ ఇప్పుడు చురుగ్గా ఉంది. అన్నాడీఎంకేతో పొత్తులోభాగంగా గెల్చుకున్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నా… ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతోంది. అక్కడ యువకుడైన అన్నామలైని టీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో సీన్ మారిపోయింది. అయన ప్రభుత్వంతో పోరాడుతున్నారు. దీంతో సహజంగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలన్నీ బీజేపీ వైపు చేరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు.. ఏపీకి వచ్చే సరికి సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త తరానికి వారి రాజకీయం కనెక్ట్ కావడం లేదని సహజంగానే అర్థం చేసుకోవచ్చు. ఏపీ బీజేపీలో కీలకమైన యువత నేతలు ఉన్నారు. మంచివాగ్ధాటి ఉన్న నేతలు ఉన్నారు. బీజేపీకి కాస్త బలం ఉన్న రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్రలో మాధవ్ వంటి నేతలు ఉన్నారు. వారు బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సిద్ధహస్తులు కూడా. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేతలు. వారికి అవకాశం ఇస్తే సీన్ మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. కన్నా లక్ష్మినారాయణ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు బాగానే వినిపించింది. కానీ సీనియర్‌గా … సామాజికవర్గ కోణంలో పరిశీలించిస సోము వీర్రాజుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం పూర్తయింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువనాయకత్వానికి చాన్స్ ఇస్తే బీజేపీ పరిస్థితిలో మార్పు వస్తుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.
previous post