ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల మధ్య జరుగుతున్న నలుగుతున్న రాజకీయం ఇదే.. సీఎం కుర్చీ చుట్టూనే ఊహలు.. విశ్లేషణలు.. వచ్చే ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించి తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే లక్ష్యంగా ఏపి లోని మూడు ప్రధాన పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని ఈసారి మళ్లీ తాను కచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని కుండబద్దలు గొడుతుంటే.. గత ఎన్నికలలో మెజార్టీ సీట్లతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి జరగబోయే ఎన్నికలలో గతం కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మళ్లీ తానే సీ ఎం గా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. గతం కంటే నేడు ఆ పార్టీ బాగా పుంజుకుని ప్రధాన పార్టీలకు గట్టి పోటీగా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రజలు ఆశీర్వదిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపి మంచి పాలన అందిస్తామని చెబుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగానే ఉన్నాయి. ఆ మూడు పార్టీల అధినేతలు సీఎం సీటు మీద కన్నేసి తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అమలు కానీ హామీలను, ఆచరణ సాధ్యం కానీ ప్రకటనలను గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఒకరు మంచి అనిపించుకోవాలంటే మరొకరిని చెడ్డగా చూపించాలి. ఎదుటివారు తప్పొప్పులను భూతద్దంలో చూపించాలి. ఉన్నవి లేనివి కల్పించి చెడుగా చెప్పాలి. పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాలి. విమర్శలు చేయాలి. ఈ మూడు పార్టీల నేతలు ప్రస్తుతం చేస్తున్న పని అదే. అయితే ఇక్కడ అటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ,ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి వారే సాటి. ఏ విషయంలో కూడా ముగ్గురిని తక్కువగా అంచనా వేయలేము. ప్రత్యర్ధులను తమ చతురతతో ముప్పతిప్పలు పెట్టగల సమర్థులు. అందులో ఒకరు తనకున్న రాజకీయ అనుభవంతో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తూ సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమర్థులు. మరొకరు ఎటువంటి పెద్ద విపత్తు ఎదురైనా సరే దాని ముందు నిలబడి ఆలోచననాత్మక ధోరణితో వ్యవహరించగల ఉద్దండులు. ఇంకొకరు ఎటువంటి సవాళ్లు నైనా స్వీకరించి, తాను అనుకున్నది సాధించడానికి వెనకడుగు వేయకుండా, దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేసే వ్యక్తి. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ఏపీలో రాజకీయం సాగుతుంది. వారికున్న అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో తామే సీఎం అంటూ ఎవరికి వారు అనుకుంటున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరు సీఎం గా ఉండాలి అనేది మాత్రం ప్రజలే నిర్ణయించాలి. ప్రజాభిమానం మెండుగా ఉండే వాళ్లే వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా నెగ్గుతారన్న విషయం సుస్పష్టం. అందుకే పార్టీ అధినేతలు జనంలోకి రావడానికి తాపత్రయపడుతున్నారు. ఈ ముగ్గురిలో మాత్రం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజలతో మమేకమవుతున్నారు. ఆ సమయంలో ఆ కార్యక్రమం పలు విమర్శలకు, వివాదాలకు, ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి అంతకుమించి ప్రచారం బాగా జరుగుతుంది. పవన్ ప్రసంగాలు యువతను బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఆయన సమావేశాలకు, సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారు. పవన్ కళ్యాణ్ వేవ్ చూస్తుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికలలో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి సీఎం రేసులో ముందు వరుసలో ఉంటారనడం లో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు టిడిపి బలో పేతానికి అంతగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయిదారుగురు నేతలు తప్ప టిడిపిలో ఎవరు పెద్దగా యాక్టివ్ గా లేరన్నది వాస్తవం. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవం, చతురత, దూర దృష్టితో సమయానుకూలంగా స్పందించి వ్యూహాత్మకంగా వ్యవహరించి టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నారన్నది కూడా నిజమే.. ఎప్పుడు వచ్చాం అన్నది కాదు, ఎలా వచ్చామన్నది కాదు, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించామా లేదా అన్నదే ముఖ్యం. ప్రజల గుండెల్లో ఉంటే అదే చాలు. ఏ నాయకుడు కావాలన్నది ఓటు ద్వారా ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటారని వైసిపి భావిస్తుంది. ప్రస్తుతం వచ్చిన సీట్ల కంటే వచ్చే ఎన్నికలలో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించడం ఖాయం అన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అదే విషయం పలు సందర్భాలలో ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు విడివిడిగా వచ్చిన, లేదా కలిసి వచ్చిన వచ్చే ఎన్నికల్లో తామే విజేతగా నిలుస్తామని చెబుతున్నారు. ఈ మూడు పార్టీల నేతల బల బలాలు చూస్తే ఎవరికి ఎవరు తక్కువ కాకుండా ఉన్నారని అయితే ఎవరు ఊహించని విధంగా జన నేతగా కీర్తించబడుతున్న వ్యక్తి మాత్రమే వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -(సనార వంశీ)