తెలంగాణలో కెసిఆర్ ను ఎలాగైనా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ, తెలంగాణ జన సమితి, వైయస్సార్ టిపి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగనుండడం పోలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెరిగింది. జనసేన పోటీ వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో పోటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సై అనడంతో టీ పాలిటిక్స్ లో పవన్ ఎంట్రీ ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్. ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖాయమైందనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో టిడిపి బిజెపితో పవన్ కళ్యాణ్ పని చేస్తారా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. వచ్చే తెలంగాణ ఎన్నికలలో చావో రేవో అన్నట్లుగా భావిస్తున్న బిజెపి ఇక్కడ గెలుపే టార్గెట్ గా వ్యూహాలను రచిస్తుంది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో బిజెపి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే గతంలో హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జనసేన మద్దతు తమకు అవసరం లేదని బీజేపీ బహిరంగంగానే ప్రకటించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.అప్పటి నుంచి తెలంగాణలో జనసేనకు, బీజేపీకి మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఇక ముందు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని ఇరుపార్టీల నేతలూ భావిస్తున్నారు. తెలంగాణలో జనసేనను పట్టించుకునేంత సీన్ లేదనేది బీజేపీ ఫీలింగ్. అందుకే ఆ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో మరోసారి అధికారాన్ని దక్కించుకుని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా బీ ఆర్ ఎస్ (టీఆర్ఎస్) పావులు కదుపుతోంది. ప్రత్యర్ధులు ఎంతమంది ఉన్నా సరే మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించి అధికారం చేపడతామని బీఆర్ఎస్ (టిఆర్ఎస్) ధీమా వ్యక్తం చేస్తుంది. బలమైన కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఏ ఒక్క పార్టీకి కూడా అది సాధ్యం కాని విషయం. అందుకే కలిసి వచ్చే పార్టీలతో బీఆర్ఎస్ పై పోరుకు బిజెపి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణలో బిజెపి – జనసేన మధ్య వచ్చిన గ్యాప్ ను పూడ్చేందుకు బిజెపి శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు కూడా బీజేపీతో కలిసేందుకు ఆసక్తి చూపుతుండటంతో కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో టీడీపీ బలహీనపడినా, క్యాడర్ బలంగానే ఉందనే ప్రచారం ఉంది. ఇక పవన్‌కు ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువమంది అభిమానులు ఉన్నట్లు చెబుతారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం బీఆర్ఎస్‌కు ట్రబుల్స్ వచ్చే అవకాశముందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన మద్దతు దొరికితే మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీకి కొంతవరకైనా లాభం ఇప్పటికిప్పుడు దక్కకపోయినా స్ట్రాంగ్ ఫ్లాట్ ఫామ్ ఏర్పడుతుందని చెబుతున్నారు. మరోపక్క తెలంగాణలో జనసేన పార్టీ పోటీపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని జనసేన తెలంగాణలో పోటీ చేయడమేంటని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీ సపోర్ట్ లేకుండా అన్ని సీట్లలో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ కు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు ఇప్పటికీ ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగతంగా జనసేన పార్టీ పటిష్టంగా లేదని విమర్శిస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలు లేవు. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పటిష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టకుండా తెలంగాణలో పోటీ చేయాలనే నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఏదేమైనాప్పటికి తెలంగాణ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది32 నియోజకవర్గాల్లో నూతన కార్యనిర్వాహకులను నియామించింది. నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి ఎక్కవగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటి విడతగా 32 మందికి కార్యనిర్వహకులుగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అటు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయించుకుంటామని చెప్పారు. రెండు లేదా మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. తెలంగాణ నుంచే తాను పోరాట పటిమ నేర్చుకున్నానంటూ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారిని గుర్తు చేశారు. కొండగట్టు నుంచి తెలంగాణ రాజకీయాలను ప్రారంభిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి జనసైనికులు సిద్ధమవ్వాలని పవన్ పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకొని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దామని చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపాలన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో చర్చించుకొని, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సత్తా చాటుదామని సూచించారు.
previous post
next post