తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు టీడీపీ చుట్టే తిరుగుతున్నాయి.. ప్రత్యేక్షంగా ప్రస్తావించకపోయినా ఎన్టీఆర్‌ను పొగడటం.. క్లిష్టమైన సందర్భాల్లో చంద్రబాబును ప్రశంసించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలు తమదైన వ్యూహం అమలు చేస్తున్నాయి. దీనికి కారణం కీలకమైన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల అభిమానం పొందడమే. అందుకే అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ విషయంలో ప్రత్యేకమై స్నేహభావన ప్రదర్శిస్తున్నాయి. టీడీపీ ఎందుకంత కీలకంగా మారింది ? అన్న అంశం చర్చానీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే.. బీజేపీ టీడీపీకి దగ్గరవుతోంది. ఇదంతా తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంలో భాగమేనని ఆంధ్ర నుంచే విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు ప్రకటించనుందని.. రాష్ట్రంలో టీడీపీకి బీజేపీకి సహకరించేలా ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ నేతలు కూడా టీడీపీ పట్ల సానుకూలత ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎన్టీఆర్‌ను ఎప్పుడు సందర్భం వచ్చినా పొగుడుతున్నారు. తెలుగు జాతి గర్వంచదగ్గ మహానటుడు రాజకీయాలను మలుపుతిప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని బండి సంజయ్ ఇటీవల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశంసించారు. అంతకు ముందు ఎన్టీఆర్ జ్ఝాపకాల గుర్తుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ నేత చేసిన వ్యాఖ్యలను కూడా గట్టిగా ఖండించారు. దీంతో టీడీపీ సానుభూతి పరుల్లో పాజిటివిటీ పెంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్‌ను పట్టించుకోలేదు. గ్రేటర్ పరిధిలో ఉండే ఆ ఘాట్‌ను జయంతి, వర్థంతుల సందర్భంగా అలంకరించకపోవడంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిర్వహణను తమకు ఇవ్వాలని ఓ సారి డిమాండ్ చేశారు కూడా. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల జరిగిన శతజయంతి వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడమే కాదు.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ తరచూ ఎన్టీఆర్ తెలంగాణకు చేసిన మేళ్లను చెబుతూ ఉంటారు. చంద్రబాబు గురించి కేటీఆర్ సానుకూలంగా మాట్లాడుతూంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఆకట్టుకునే విషయంలో ప్రత్యేక పంధాలో ఉన్నారు. తనపై ఉన్న చంద్రబాబు ముధ్రను ఆయన గట్టిగా ఎప్పుడూ ఖండించుకోలేదు. అదే సమయంలో చంద్రబాబును విమర్శించరు. టీడీపీపై సానుభూతి చూపిస్తున్నట్లుగానే ఉంటారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి పక్కా ప్లాన్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును విమర్శించకపోవడం.. టీడీపీ వల్లే ఎదిగానని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూండటంతో ఆయనపై టీడీపీ సానుభూతిపరుల్లో పాజిటివ్ అభిప్రాయం ఉంది. ఆయనకు కావాల్సింది కూడా ఇదే. సెటిలర్లలో రేవంత్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని మల్కాజిగిరిలో ఆయనకు క్రాస్ అయిన ఓట్లే లెక్కలు చెబుతున్నాయన్న అంచనా ఉంది. ఆ అడ్వాంటేజ్‌ను కాపాడుకునేందుకు రేవంత్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల కూడా ఎన్టీఆర్ , చంద్రబాబు విషయంలో సానుకూల కామెంట్లు చేస్తున్నారు. ఓ సారి కరోనా సంక్షోభ సమయంలో.. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత అధికారంలో ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా షర్మిల మరో ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను వేనోళ్ల పొగిడారు. ఎన్టీఆర్ తెలంగాణలో ఆయన అమలు చేసిన సంస్కరణలు.. సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. పక్కా వ్యూహంతోనే.. చంద్రబాబు, ఎన్టీఆర్‌లపై ప్రశంసలు గుప్పించారని అందరికీ అర్థమైపోయింది. ఆమె టార్గెట్ కూడా టీడీపీ సానుభూతిపరుల ఓట్లే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలియదు. కానీ ఆ పార్టీకి నిలకడైన ఓటు బ్యాంక్ ఉందని అన్ని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 15 .. బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి దాదాపుగా ఇరవై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. అయితే తర్వాత టీడీపీ పరిస్థితి తిరగబడింది. గత ఎన్నికల్లో 3.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. ఆ తర్వాత కూడా నేతలంతా వలస బాట పట్టారు. దీంతో టీడీపీ మరింత బలహీనపడింది. సానుభూతిపరులైన ఓటర్లు ఉన్నారు కానీ…వారు కూడా టీడీపీకి ఓటు వేయలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎలా లేదన్నా.. టీడీపీకి కనీసం మూడు నుంచి ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంటుందన్న అంచనా అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది.
previous post
next post