తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తామని… ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దుకాణదారులు సైతం ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరోవైపు.. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణంగా గంటకు 4500 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే ప్రస్తుతం గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తప్పలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఈ కంపార్ట్ మెంట్లలో 4 కి.మీ.మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గాను కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల కొండలు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించడం కోసం క్యూ లైన్ మార్గాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాల్సి వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారాంతపు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలుంటాయని టీటీడీ అధికారుల తెలిపారు.
previous post
next post