పాన్ ఇండియా సినిమాలతో జోరు మీదున్న తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి తమిళ హీరోలు ప్రస్తుతం సంకోచించడం లేదు. బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలతో దేశం మొత్తం మీద కలెక్షన్ లు కొల్లగొడుతున్న తెలుగు సినిమాలపై ఇప్పటికే చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలుగు దర్శకుల ప్రతిభను అన్ని ఇండస్ట్రీ పెద్దలు కొనియాడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మేజర్ చిత్రం సైతం అందర్నీ ఆకట్టుకుంది. దశాబ్దాల క్రితం బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి సినిమాలు తెచ్చుకుని తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు మారాయి. తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. గతంతో పోలిస్తే ఇటీవల తెలుగు సినిమాలు విజయాల శాతం కూడా పెరిగింది. దీంతో దేశం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ వైపు చూస్తోంది. క్రమంగా తన స్థాయిని పెంచుకుంటున్న తెలుగు సినిమా ఇప్పుడు పక్కనే ఉన్న తమిళ స్టార్ హీరోలను ఆకర్షిస్తోంది. తమిళ్ స్టార్ హీరో లు విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ లు తెలుగు దర్శకుల ప్రతిభకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే ఆ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు ప్రారంభించేశారు. కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు విజయ్ టాలీవుడ్‌లో వంశీ పైడిపల్లితో జట్టు కట్టాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రష్మిక మందన్న కథానాయిక, దిల్ రాజు నిర్మాత. ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ‘మారి’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మంచి కథ కోసం ఎదురు చూసిన ధనుష్ ‘సార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.నాగ వంశీ నిర్మిస్తున్నారు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాకూ ధనుష్ తన అంగీకారం తెలిపాడు. ఇది ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. తమిళ పరిశ్రమలో సహజ నటుడిగా పేరున్న శివ కార్తికేయన్‌కు తెలుగులోనూ అలాంటి గుర్తింపే ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించాడు. ఆసియన్ సినిమాస్, శాంతి టాకీస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వీరే కాకుండా తెలుగులో అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య, కార్తీలు తెలుగు సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.మంచి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా మంది తమిళ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇక్కడి డైరెక్టర్స్ తో కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి విజయం సాధించి తెలుగులో కూడా తమ మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ హీరోలు వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే మరోపక్క టాలీవుడ్ హీరోలు కూడా తమిళ్ స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తొలిసారి రామ్ చరణ్ హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. మాస్ సినిమాల స్పెషలిస్ట్ లింగుసామి సైతం తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నారు. రామ్ హీరోగా ఈయన ది వారియర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జులై 14న విడుదల కానుంది. మరోవైపు బోయపాటి శ్రీను మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ దాటి అడుగు బయటికి పెడుతున్నారు. రామ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు. వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ కు ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు లోకేష్ రేంజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసాయి. త్వరలోనే రామ్ చరణ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు లోకేష్. మొత్తంగా చూస్తే తమిళ దర్శకులు తెలుగు హీరోలతోనూ, తెలుగు దర్శకులు తమిళ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కాంబినేషన్లు త్వరలో సెట్ అయ్యే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లతో కూడా తమిళ దర్శకులు సినిమాలు చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలో ఈ తెలుగు టాప్ హీరోల బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా హీరోలు తమ మార్కెట్ ను పెంచుకునేందుకు బైలింగ్వల్ చిత్రాలలో నటించాలనే ఆసక్తిని చూపుతున్నారు. తమ మార్కెట్ పరిధిని మరింత విస్తృత పరుచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
next post