జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ లేని విధంగా పార్టీలో కోవర్టుల ప్రస్తావన తీసుకొచ్చారు.. తన నేతృత్వంలో పార్టీ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తానని.. ప్రకటించారు. జిల్లాల వారీగా కొంత మంది నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయి.. వారి ఎజెండాను జనసేన ఎజెండాగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొంత మంది సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్… కోవర్టుల గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి కోవర్టుల బెడద మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లోనే టిక్కెట్లు తీసుకున్న చాలా మంది … ఇతర పార్టీలతో కుమ్మక్కయి సైలెంటయ్యారు. ఈ కారణంగా జనసేన అభ్యర్థులు ఉన్నారా లేరా అన్న స్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపించింది. ఆ తర్వాత అలా చేసిన అనేక మంది పార్టీ వీడి అధికార పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల తర్వాత ఫలితాలు రాక ముందే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వారంతా కోవర్టులుగా పని చేశారని జనసేనలో అనుమానాలున్నాయి. వారి తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాల్లో కొంత మంది చురుగ్గా పాల్గొంటున్నారు. మీడియాలో ఆ పార్టీ తరపున క్రియాశీలకంగా మాట్లాడుతూ ఉంటారు. మరికొంత మంది సోషల్ మీడియా నేతలుగా చెలామణి అవుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ జనసేనలో ఓ రకమైన అలజడి కనిపిస్తోంది. పార్టీలో ముఖ్య నేతల తీరుపై కొంత మంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఓ వ్యూహం ప్రకారం చేస్తున్నారని వారంతా ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని జనసేన అధినేతకు పక్కా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే వారు పార్టీ కోసం కొంత కాలంగా పని చేస్తూండటంతో నేరుగా మందలించలేని పరిస్థితి. అందుకే ఒక చాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇలా బహిరంగ హెచ్చరికలు జారీ చేశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ఎవరెవరు కోవర్టులో స్పష్టత ఉందని.. వారి గురించి ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించుకున్నారని అంటున్నారు. వారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేప్రయత్నాలు ఇప్పటికే చేపట్టారని అంటున్నారు. కోవర్టుల వ్యవహారంతో పాటు మరికొంత మంది జనసేన ముఖ్య నాయకులుగా చెలామణి అవుతూ టిక్కెట్లు ఇప్పిస్తామని హమీలు ఇస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. పవన్ కల్యాణ్ ఎంతగానో నమ్మిన నెల్లూరుకు చెందిన ఓ నేత ఇలాగా చేసి.. విషయం బయటపడేసికి సైడ్ అయ్యారని.. చివరికి ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన మరో నేత.. వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడిగా పేరు తెచ్చుకున్నారు. జనసేన విధాన నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ.. మాట్లాడటం ఆయన నైజం. ఆయన తీరుపై కూడా పవన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. జనసేన పార్టీ క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఉంది. పార్టీ పట్ల అంకితభావం.. ఇతర పార్టీల ప్రభావాన్ని తట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లేకపోతే.. బీఫాంలనే అభ్యర్థులు అమ్ముకునే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన పవన్ కల్యాణ్.. హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. హెచ్చరికలతో సరి పెట్టుకుండా..ఇలా కోవర్టులుగా ఉన్న నేతలను గుర్తించి వెంటనే ఏరివేయాలని జనసైనికులు కోరుతున్నారు.