శ్రీలంకను అడ్డంపెట్టుకుని హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకోవాలని చైనా గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంకలో పలు ప్రాజెక్టులు చేపట్టడం లో భాగంగా హంబన్ టోట పోర్టును అభివృద్ధి చేసి, తన నౌకల రాకపోకలకు ఓ స్థావరాన్ని ఏర్పరచుకున్నట్లు పలు కథనాలు వచ్చాయి. భారత్ ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్ తో పాటు చైనా కూడా కుయుక్తులు పన్నుతుంది. భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆర్థికంగా ఆదుకుంటూ వాటిని తన వైపునకు తిప్పుకుంది. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే భారత చుట్టు ఉన్న దేశాల నుంచి ఏకకాలంలో దాడి చేయాలని భావిస్తున్న చైనా శ్రీలంక నుంచి భారత్ పై పూర్తిగా నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. భవిష్యత్తులో అటు పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చనే ముందు ఆలోచనతో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ వెళ్తుంది. ఇదిలా ఉండగా అత్యాధునిక సైనిక వ్యవస్థలు కలిగివున్న ఓ నౌకను శ్రీలంక పంపించేందుకు చైనా సన్నద్ధమవుతుంటే ఈ నౌక కోసం పూర్తిగా తెలిసిన భారత్ అప్రమత్తమైంది.అత్యాధునిక సైనిక వ్యవస్థలు కలిగివున్న యువాన్ వాంగ్-5 నౌకను శ్రీలంకలోని హంబన్ టోట పోర్టుకు రాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలుగా తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. శ్రీలంకపై భారత్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే శ్రీలంకలోని హంబన్ టోట పోర్టును కొన్నేళ్ల నుంచి చైనా నిర్వహిస్తున్నప్పటికి అన్ని విషయాలలోను తమకు చేదోడుగా నిలుస్తున్న భారత్ అభ్యర్థనకు శ్రీలంక స్పందించింది. ఆ నౌకను శ్రీలంకకు తీరానికి పంపించవద్దని చైనాకు విన్నవించింది. ఈ నౌక రాక పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నౌక సాధారణ పరిశీలన నిమిత్తమే హంబన్ టోట పోర్టుకు వస్తోందని శ్రీలంక వర్గాలు వెల్లడించినప్పటికి ఇది నిఘా నౌక అని భారత్ అనుమానిస్తోంది. ప్రధానంగా పరిశోధన, సర్వే కోసం ఉద్దేశించినట్టుగా చెబుతున్నా, నిఘా వేయడానికి అవసరమైన సాధన సంపత్తి యువాన్ వాంగ్-5 నౌకలో ఉన్నాయని భారత్ భావిస్తోంది. అయితే, భారత్ పలుమార్గాల్లో చేసిన ఒత్తిళ్లతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కితగ్గింది. జియాంగ్యిన్ రేవు నుంచి యువాన్ వాంగ్-5 నౌకను ఇప్పుడు పంపవద్దంటూ చైనాకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొలంబోలోని చైనా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. శ్రీలంకపై భారత్ ఒత్తిడి తీసుకొచ్చి తమ నౌకను అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై అటు చైనా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. విపత్కర పరిస్థితిలో శ్రీలంకను అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్న చైనాకు శ్రీలంక నిర్ణయం మింగుడు పడటం లేదు. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాను ఢీకొట్టే స్థాయిలో ఉన్న చైనా సమీప భారత్ దేశం తమకు సవాల్ విసురుతూ ఉండడంపై తట్టుకోలేక పోతుంది. చాలా విషయాలలో భారత్ కు అమెరికా మద్దతు ఇవ్వడంపై కూడా మండి పడుతుంది. కచ్చితంగా తమ నౌకను శ్రీలంక పంపించి తీరుతామని చైనా అధికారులు చెబుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలలో వార్తా కథనాలు వెలవడుతున్నాయి.
previous post
next post