Vaisaakhi – Pakka Infotainment

చిరంజీవి కి గేలం వేస్తున్న బీజేపీ

అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి 175 సీట్ల లక్ష్యంగా వైసిపి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతుంటే మరొక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి అధికారం తమదేనని ధీమాగా వున్నారు. ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణే ముఖ్యమంత్రి కానున్నారని జనసైనికులు ప్రచారాన్ని అదరగొట్టేస్తున్నారు.ఇక బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఎదిగే అవకాశాలు ఏ మాత్రం లేనప్పటికి కేంద్రం మద్దతు వల్ల కొద్దిగా హడావుడి మొదలెట్టింది. మరో పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళ్తే కానీ వర్కవుట్ కానీ బిజెపి. వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని అటు కేంద్ర నాయకత్వం, ఇటు రాష్ట్ర నేతలు ఇదివరకే స్పష్టం చేసినప్పటికీ వైసీపీతో తమ తండ్రీకొడుకుల అనుబంధం కొనసాగిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కంటే వైసీపీ నేతలకే బిజెపి నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు జనసైనికులకి మింగుడు పడని అంశం.ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ బిజెపికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే వివాద రహితుడిగా, అందరివాడుగా మంచి పేరు ఉన్న మెగాస్టార్ చిరంజీవి పట్ల మాత్రం అటు బిజెపి,ఇటు వైసిపి ప్రత్యేక అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నాయి. టిడిపి తో సమానంగా జనసేన కూడా బద్ధ శత్రువుగానే వైసీపీ చూస్తోంది. ఇదిలా ఉంటె రాష్ట్రంలో చరిష్మ గల సినీ హీరోగా , పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం మద్దతు కూడా చిరంజీవి వెనుక ఉండటంతో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మెగాస్టార్ చిరంజీవి చుట్టూ తిరుగుతుంది. మెగాస్టార్ ను దగ్గర చేసుకునేందుకు అటు బిజెపి, ఇటు వైసిపి తమ ప్రయత్నాలను చేస్తున్నాయి. అన్నను ప్రసన్నం చేసుకుని తమ్ముడు స్పీడ్ కి కళ్లెం వేయాలని వైసీపీ ఆలోచిస్తుంటే మరొ పక్క బీజేపీ చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించి కీలకమైన బాధ్యతలను అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గా బీజేపీ బరిలోకి దిగితే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. చిరంజీవి బిజెపి సీఎం అభ్యర్థి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా అన్నకు మద్దతు ఇస్తారని బిజెపి ఇప్పటికే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ చాన్నాళ్ల క్రితమే జనసేన – బిజెపి కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బిజెపిలోకి చిరంజీవిని ఆహ్వానించాలనే ఆలోచన ప్రస్తుతం పక్కకు వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి ప్రస్తుతం ఆ పార్టీకి కూడా దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా తను రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. రాజకీయాల్లోకి వచ్చి మిత్రులను శత్రువులుగా మార్చుకునే అవసరం తనకు లేదని, అందరూ తనకు కావాలని, అందరితో సన్నిహితంగా ఉండాలనే తను కోరుకుంటున్నట్లు అతని ఆత్మీయులు చెబుతున్నప్పటికీ భీమవరం లో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ లో చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ స్పెషల్ ఇంట్రస్ట్ ని చూపించడం ఇదంతా వ్యూహం లో భాగమేనని అంటున్నారు ఆ సభకు ఆహ్వానం అందినప్పటికి వేరే కార్యక్రమాలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం తో ఈ ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఇదిలా ఉండగా జనసేనని అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ పై విరుచుకుపడటం కూడా బీజేపీలో కొంతమంది నచ్చడం లేదన్నది టాక్ వచ్చే ఎన్నికలలో పోటీ గట్టిగా ఉన్నప్పటికీ బిజెపి తమకు అనుకూలంగా ఉంటే చాలు అన్నట్లు వైసిపి నాయకత్వం ఆలోచిస్తుంది. గత ఎన్నికలలో ఏపీలో వైసిపి గెలవడానికి వెనుక బిజెపి నాయకత్వం ఉన్నట్లు ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. రాష్ట్రంలో బిజెపికి ఓటింగ్ శాతం అంతగా లేనప్పుటికీ కూడా ఆ పార్టీ తలుచుకుంటే రాష్ట్రంలో తాము అనుకున్న వాళ్ళే అధికారంలోకి వస్తారని కొందరు కుండబద్దలు కొడుతున్నారు. ప్రజా సమస్యలపై వైసీపీతో ఒకపక్క పోరాటం చేస్తుంటే తమ మిత్ర పార్టీ అయినా బిజెపి మాత్రం వైసీపీతో అంట కాగడంతో పవన్ కళ్యాణ్ కు అసలు నచ్చడం లేదట. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కమలం పార్టీ నేతలు బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధి బరిలో నిలుస్తున్నారని చెప్పగా.. జనసేన అధినేత మాత్రం తాము ఆత్మకూరు ఎన్నికకు దూరంగా ఉన్నామని స్పష్టం చేసారు. దీంతో ఆత్మకూరులో చోటు చేసుకుంటున్న రాజకీయాలు అంతర్గత వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారాయి. పదవిలో ఉంటూ ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఆ కుటుంబసభ్యులు పోటీపడితే పోటికి దూరంగా ఉండాలన్నది టీడీపీ విధానం కాగా టిడిపి తో పాటు జనసేన కూడా దూరంగా ఉంది. కానీ బిజెపి మాత్రం అభ్యర్థి ని రంగంలో దింపింది. ఈ ఉప ఎన్నిక విషయంలో కూడా బిజెపికి – జనసేనకి చెడిందనే ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో బిజెపికి కటీఫ్ చెప్పి సింగల్ గా పోటీ చేయాలని పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే విన్నవించారని సమాచారం. రాష్ట్రంలో మరొకసారి వైసీపీ ప్రభుత్వం రాకూడదని అందుకోసం అవసరమైతే బిజెపిని కాదని టిడిపి తో జతకట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం బిజెపి తప్పనిసరిగా మెగాస్టార్ చిరంజీవి పార్టీలో ఆహ్వానించి అతనికి కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి వైసిపి కూడా బిజెపి పట్ల వ్యతిరేకతగా ఉంటే మాత్రం ఇక బీజేపీ ఎవరికీ సపోర్ట్ చేయకుండా చిరంజీవిని తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల పట్ల విముఖత తో ఉన్న చిరంజీవి ఈ ప్రతిపాదనకు సై అంటారా.? లేక తమ్ముడి నిర్ణయాన్ని సమర్ధిస్తారో వేచిచూడాలి..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More