ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో వీరు కలిసి కనిపించనుండంతో మెగా అభిమానులు, జనసైనికులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను భీమవరంలో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సైతం ఆహ్వానించింది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీనటుడు చిరంజీవికి సైతం ఆహ్వానాలు అందాయి. కేంద్ర మాజీ పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిరంజీవిని ప్రస్తుత టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. దీంతో అన్నదమ్ములను చానాళ్ల తర్వాత ఒకే వేదికపై చూసే అవకాశం దక్కుతోంది. అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి ఏనాడూ రాజకీయ మద్దతు ప్రకటించలేదు. పైగా ఏపీ సీఎం జగన్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సినిమా టిక్కెట్ల విషయంలో చిరంజీవి అభ్యర్థను జగన్ మన్నించి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడినట్లు వార్తలొచ్చాయి. జనసేనను దెబ్బకొట్టేందుకు చిరంజీవిని వైసీపీ తరపున రాజ్యసభకు పంపనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించనుండటం ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందా? అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా చూస్తున్నారు.
previous post