రాజ్యసభలో వైసీపికి కొత్తగా ఎన్నికయిన నలుగురు ఎంపీల్లో ముగ్గురి సొంత జిల్లా నెల్లూరు. అంటే ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నట్లు లెక్క. ఈ ముగ్గురిలో పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలవైపు రావాలని భావించారు..అయితే 2014లోనే వైఎస్సార్‌సీపీలో చేరాలని భావించినప్పటికి కొన్ని పరిణామాలతో రాజకీయాలవైపు రాలేదు. ఆ తర్వాత 2018లో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయనకు అధినేత జగన్ రాజ్యసభ అవకాశం కల్పించారు. అలాగే బీద మస్తాన్‌రావు ప్రముఖ వ్యాపారవేత్త. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సొంత ఊరు. ఆయన బీకాం చదివారు. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ తర్వాత చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసి.. ఆక్వా రంగంలోకి దిగి ఉన్నతస్థాయికి ఎదిగారు. జెడ్‌పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా మస్తాన్‌రావు పనిచేశారు. 2019లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇటు విజయసాయిరెడ్డిది నెల్లూరు జిల్లా తాళ్ళపూడి గ్రామం. చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా.. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా 2016 నుంచి 2022 వరకు ప్రాతినిధ్యం వహించారు. మరోసారి రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడం తో ముగ్గురురాజ్యసభ సభ్యులున్న జిల్లా గా నెల్లూరు జిల్లా గుర్తింపు పొందింది