Vaisaakhi – Pakka Infotainment

ఏ దిక్కుని ఎవరు పాలిస్తున్నారు.

భారతీయతత్వం లో మరి ముఖ్యంగా హైందవ సంస్కృతి లో దిక్కులకు విశేష ప్రాముఖ్యత వుంది. వాస్తు, జ్యోతిష శాస్త్రాలకు ఇవే ఆధారం. పేరు రీత్యా, వ్యక్తి గ్రహగమనాల రీత్యా నివసించే ఇల్లు , వ్యాపారం చేసే ప్రదేశం ఏ దిక్కులో వుండాలి. ఎక్కడ వుంటే వారికి అన్ని విధాలుగా ప్రయోజనం వుంటుంది అన్నది. దిశల ఆధారంగానే లెక్క కడుతుంటారు. ఆ అధిదేవత ఇచ్చే ప్రయోజనాల బట్టే మన జీవితం ఆదారపడుతుంది అని నమ్మే వాళ్ళు చాలామంది వున్నారు. అసలు ఈ దిక్కులేంటి…? వాటి పాలకులు ఎవరు…? మనకుండే ఎనిమిది దిక్కులని ‘అష్ట దిక్కులు’ అంటాము. వాటిని పాలించే వారిని ‘దిక్పాలకులు’ అంటారు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములు ‘దిక్కులు’ కాగా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు దిక్కుల మద్యభాగాలలో వుంటాయి వీటిని విదిక్కులు అని మూలలు అని కూడా ప్రస్తావిస్తూవుంటారు వీటన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాం. కొన్ని సందర్భాలలో పైన ఉండే ఆకాశాన్ని క్రింద ఉండే భూమి ని కలిపి దశదిశలు అని వాడుతుంటారు. తూర్పు దిక్కుకు అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము ‘అమరావతి.’ ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధలు ఉంటాయి. ఇక పడమర దిక్కుకు వరుణుడు అధిష్ఠాన దేవత. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం. ఉత్తర దిక్కును పాలించే అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి. దక్షిణ దిక్కును యమధర్మరాజు అధిష్ఠాన దేవత. ఈయనకు దండపాణి అని మరో పేరు యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను ‘దండపాణి’ అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆగ్నేయ దిక్కుకు అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం,అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం కలుగుతాయి. వాయువ్య దిక్కును పాలించు అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే ఈశాన్య దిక్కు అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి. ఇలా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు. దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More