వచ్చే ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జెడి లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. గత ఎన్నికలలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ వచ్చిన ఓటింగ్ శాతం పై సంతృప్తి గానే వున్నారు అయితే తన శ్రేయోభిలాషులు, విశాఖ ప్రజలు తనను మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేయాలని కోరుకోవడంతో వచ్చే ఎన్నికలలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే పలానా పార్టీ అని అయన చెప్పకపోయినప్పటికీ పదే పదే ఆద్మీ పార్టీ కోసం, ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరు కోసం, ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణ కోసం జెడి లక్ష్మీనారాయణ చెప్పడం జరిగింది. అయితే గత ఎన్నికలలో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈసారి కూడా అదే పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక టిడిపి నుంచి ఇక్కడ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ మళ్లీ ఎంపీ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఒక సీనియర్ నాయకుడిని ఖరారు చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ టిడిపి- జనసేన కలిసి పోటీ చేస్తే జనసేన అభ్యర్థి పోటీలో ఉండడం జరగదు. ఈ లెక్కన చూస్తే జెడి లక్ష్మీనారాయణ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేయాలి లేదా తనకు ఎంతో ఇష్టమైన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అయినా బరిలోకి దిగాలి. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలు కూడా అతనికి టచ్ లో లేవు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏదైనా జరిగే అవకాశం ఉంది. మళ్లీ జనసేన నుంచి పోటీకి దిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈసారి మాత్రం జనసేన, టిడిపి పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు లేదా నాదెండ్ల మనోహర్ విశాఖ ఎంపీ గా పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా జెడి లక్ష్మీనారాయణ ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది. లేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు నేరుగా ఆయనే మీడియా ఎదుట స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరువాత ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీకు ఆశించిన ఫలితాలు దక్కకపోయినా జాతీయ పార్టీ హోదా మాత్రం లభించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు గెల్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 13 శాతం ఓట్లను దక్కించుకుంది. ఒక రాజకీయ పార్టీకు జాతీయో హోదా దక్కేందుకు 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 శాతం లేదా 6 శాతం సీట్లు లభిస్తే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకోగా, గోవాలో రెండు అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో 4 స్థానాలు గెల్చుకోవడమే కాకుండా13 శాతం ఓట్లు సాధించడంతో జాతీయ పార్టీ హోదా అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ పట్ల జెడి లక్ష్మీనారాయణ ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో విశాఖ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలియజేయడం పై వేచి చూసే ధోరణిని కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఆయన దృష్టి అంతా ఆమ్ ఆద్మీ పార్టీ పైనే ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఏపీ రాజకీయాలలో ఎవరు ఊహించినవి కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.
next post