ఆగస్టు 1 వ తేదీ నుంచి అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలుగు నిర్మాతలు. కరోనా మహమ్మారి తర్వాత ఆదాయం తక్కువ కావడం, ఖర్చులు పెరిగిపోవడం వంటి ఇబ్బందులతో ఫిల్మ్ మేకర్స్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాతే తిరిగి షూటింగ్‌లు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సినిమా ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచాలని, తమ సినిమాలను ఓ ఆరోగ్యకరమైన వాతావరణంలో రిలీజ్ చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నట్లు నిర్మాతల మండలి ఆ ప్రెస్ నోట్లో చెప్పింది. అందుకే ప్రొడ్యూసర్ గిల్డ్‌లోని నిర్మాతలందరూ స్వచ్ఛందంగా అన్ని సినిమాల షూటింగ్‌లను నిలిపేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనిపై మరింత చర్చించి, ఓ పరిష్కారం కనుగొనే వరకూ షూటింగ్‌లు నిలిపేస్తున్నట్లు నిర్మాతల మండలి స్పష్టం చేసింది.