ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలైపోయి అప్పుడే ఎనిమిదేళ్ల అయిపోయింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటుంటే తొలి భాషా ప్రయోక్త రాష్ట్రం మాత్రం అవతరణ దినోత్సవానికి నోచుకోక పుట్టిన తేదీ తెలియ అనాధలా మారింది విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం జూన్ 2న నవనిర్మాణ దీక్షలతో కాస్త హడావిడి చేసిందే తప్పా.. అవతరణ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే గడిపేసింది దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఎలాగో రాష్ట్రానికి అవతరణ దినోత్సవం కూడా అలాంటిదే మరి అలాంటి ఉత్సవాన్ని నిర్వహించడానికి తేదీని ఖరారు చేయడానికి ఈ ఎనిమిది సంవత్సరాల లో గత తెలుగుదేశం ప్రభుత్వానికి గాని, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు గాని తీరిక లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీని జరపాలా…? లేక అక్టోబర్ ఒకటో తేదీని జరపాలా..? లేక తెలంగాణ నుంచి వేరుపడ్డ జూన్ రెండో తేదీన జరపాలా..? అన్న విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం గానీ ఇప్పటి వైసిపి ప్రభుత్వం గానీ స్పష్టమైన అవగాహనకు రాకపోవడమే ఉత్సవాలు నిర్వహించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది అయితే దీనిపై న్యాయ సలహాకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం మళ్లీ ఆఆ దిశ గా ప్రయత్నం చేయలేదు జూన్ రెండో తేదీన నవనిర్మాణ దీక్షతో తంతు కానిచ్చేసింది. అయితే అది ఆంధ్రుల మనసు గాయపరిచేదే కానీ వేడుక ఎంత మాత్రం కాదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు తెలుగువారికొక ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా 1953 అక్టోబర్ ఒకటో తేదీన కర్నూలు రాజధానిగా 11 జిల్లాలతో మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి వేరుపడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. అనంతరం రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తరువాత నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ స్టేట్ లోని తెలుగు ప్రాంతాలతో ఉన్న తెలంగాణతో కలిసి తొలి భాషా ప్రయత్నంగా హైదరాబాద్ రాజధానిగా 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తర్వాత ప్రకాశం రంగారెడ్డి విజయనగరం జిల్లాలు ఏర్పాటుతో 23 జిల్లాల పూర్తి ఆంధ్ర ప్రదేశ్ 2014 వరకు అలాగే కొనసాగింది తెలంగాణ ఉద్యమపోరాట ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో అదే సంవత్సరం జూన్ రెండవ తేదీన 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి ఏర్పడింది.పెద్ద మనుషుల ఒప్పందం తో తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన నవంబర్ ఒకటో తేదీని తెలంగాణ ఉద్యమకారులు బ్లాక్ డే గా నిరసనలు తెలిపినప్పటి నుంచి పగడ్బందీ బందోబస్తు నడుమ 2013 నవంబర్ 1 వరకు అవతరణ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అవే చివరి వేడుకలుగా మిగిలిపోయాయి అయితే తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక ఏపీలో భౌగోళికంగా మార్పులు మాత్రమే ఏర్పడి రాష్ట్రం అలానే ఉండడం వలన నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం గా కొనసాగించాలని కొంతమంది అభిప్రాయపడుతుండగా మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఏర్పడ్డ రాష్ట్రమే ఇప్పుడు మిగిలి ఉన్న కారణం గా అక్టోబర్ రెండు నే ఆవిర్భావ దినోత్సవం జరపాలని మరికొంతమంది కోరుతున్నారు 58 సంవత్సరాలు నవంబర్ ఒకటో తేదీనే అవతరణ దినోత్సవం జరుపుకున్నప్పటికీ అప్పటి భౌగోళిక స్వరూపం కానీ జిల్లాల ప్రాతినిధ్యం కానీ లేకపోవడం వలన అక్టోబర్ 1వ తేదీన అవతరణ దినోత్సవం జరపాలని నిజానికి ఇదే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు నిజ మైన నివాళి అని మరికొంత మంది గట్టిగానే వాదిస్తున్నారు అలాగే జూన్ 2నే రెండు తెలుగు రాష్ట్రాల అవతరణ దినోత్సవం జరిగితే బాగుంటుందని వాదిస్తున్నప్పటికి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆంధ్రులు చీకటి రోజుగా భావించే ఈ రోజున ఉత్సవాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అన్నదానిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది గత ఎనిమిదేళ్లగా అవతరణ వేడుకలకు దూరంగా ఉన్న ప్రజానీకం మళ్లీ ఆనాటి స్ఫూర్తి కావాలని ముక్తకంఠంతో కోరుతోంది అవతరణ దినోత్సవం అనేది ఒక రాజకీయ వేడుక కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరవీరుల ఆత్మార్పణకు మనమిచ్చే నివాళి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన వస్తే ఆంధ్రప్రదేశ్ కు కూడా అవతరణ దినోత్సవ గౌరవం దక్కుతుంది.