ఆకస్మిక వరద భీభత్సం ఎంతోమంది భక్తుల ప్రాణాలను బలిగొంది. ఊహించని విధంగా విరుచుకుపడిన వరద పెను విధ్వంసం సృష్టించింది. ప్రాణ భయంతో భక్తులు తలచోటకు పరుగులెత్తారు. అవకాశం లేనివాళ్లు వరదలో కొట్టుకుపోయారు. తమ కళ్ళముందే కుటుంబ సభ్యులు హహాకారాలు చేస్తూ వరదలో కొట్టుకుపోతూ ఉంటే ఏమి చేయలేని దీనస్థితిలో ఉండిపోయారు. సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. కొంతమంది ప్రాణాలను కాపాడింది. హెలికాప్టర్ లను ఉపయోగిస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతుంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో ఆకస్మిక వరద భీభత్సం సృష్టించి ఎంతమందిని పొట్టన పెట్టుకుంది. అమర్‌నాథ్‌లో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం భక్తులు పోటెత్తుతారు. కరోనా కారణంగా 2020, 2021లో యాత్ర జరగలేదు. ఈ ఏడాది జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు లక్ష మంది వరకు భక్తులు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 43 రోజుల ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11తో ముగియాల్సి ఉంది. కానీ ఈ ఏడాది యాత్ర అంతా సజావుగా సాగుతుందని భావించిన సమయంలోనే వరద బీభత్సాన్ని సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 40 మంది వరకు గత్లంతు అయినట్లు తెలుస్తోంది. అమర్నాథ్ యాత్ర కోసం వెళ్ళిన భక్తులు కొండ దిగువ ప్రాంతాలలో గుడారాలు వేసుకుని సేద తీరుతున్నారు.ఈ సమయంలోనే కొండ పై నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది.అది వరదగా మారి బీభత్సం సృష్టించింది. దీంతో కింది ప్రాంతంలో ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న చాలామంది వరదలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్నపోలీసులు, కేంద్రబలగాలు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని కాపాడారు. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కలిసి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆర్మీ హెలికాప్టర్లలో అమర్‌నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్‌లో నీలగ్రార్ హెలిప్యాడ్‌కు తరలించారు. అక్కడ వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం మౌంటెన్ రెస్క్యూ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. అమర్‌నాథ్ గుహ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం రెండు రెస్క్యూ శునకాలను హెలికాప్టర్‌లో తరలించారు అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షం కొనసాగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆకస్మిక విపత్తు పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.