దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాలలో అంతగా ప్రభావం చూపని బీజేపీ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు, కేరళ, తెలంగాణలో బిజెపికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండగా ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పరిస్థితి మాత్రం భిన్నం గా ఉంది. ఇక్కడ పార్టీకి ఓటింగ్ శాతం, కేడర్ ఏమాత్రం లేనప్పటికీ కాంగ్రెస్, వామపక్షాలు మినహా అన్ని పార్టీలను బాగానే ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బిజెపితో సయోద్యకు ఆయా పార్టీలు కూడా అర్రులు చాస్తున్నాయి. కేంద్రంలో పట్టిష్టంగా ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వచ్చిన ఒకటే. కాకపోతే తమకు అనుకూలంగా ఉండి, చెప్పినట్లు వినే ప్రభుత్వమే వుండాలనుకుంటుంది. టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. వైసీపీ ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఇక జనసేన కలిసి వెళ్తున్నప్పటికి ప్రత్యేకించి బిజెపికి అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్రజలను బాగా ప్రభావితం చేయగల జనాకర్షణ గల వ్యక్తి ఎవరు లేరు.. అలాంటి స్టార్ క్యాంపైనర్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే తమకు మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ బలోపేతానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బిజెపి కి పెద్దగా ఒరిగేదేమీలేదని భావించిన నేతలు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై ఫోకస్ పెంచింది. వాళ్ళు బిజెపి తీర్థం పుచ్చుకుని పూర్తిస్థాయిలో బిజెపి కి పని చేస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా చిరంజీవి, తెలంగాణ బిజెపి సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రకటించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీకి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రజలను ప్రభావితం చేసేంత స్టామినా వాళ్ళకి లేదన్నది సుస్పష్టం. ఏపీ బిజెపి సీఎం అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిరంజీవి ని సీఎం చేయడం కోసం మరింతగా పనిచేస్తారని కమలదళం ప్లానాట. ఇప్పటికే తమ్ముడికి మద్దతు ప్రకటించిన చిరంజీవిని పూర్తిస్థాయిలో తమ పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు సంప్రదింపులు జరిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలలో యాక్టివ్ గా లేనప్పటికీ అన్ని పార్టీలనేతలతో సత్సంబంధాలు కలిగేవున్న చిరంజీవి తమ పార్టీలొనే కొనసాగుతున్నారని చెబుతున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మాత్రం చిరంజీవి స్పందించలేదు. తను ఆ పార్టీలో ఉన్నది లేనిది కూడా స్పష్టం చేయలేదు. తనకు రాజకీయాల పడవని, మళ్లీ తనకున్న మంచి పేరును చెడగొట్టుకోలేనని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. అటు ఏపీలో కాని , ఇటు తెలంగాణలో కాని ఇమేజ్ ఉన్న చిరంజీవి బిజెపికి ప్లస్ అయ్యే అవకాశం ఉండడంతో అతనిని వదులు కోవడానికి ఇష్టపడటం లేదు. అవసరమైతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సహాయం తీసుకునేందుకు బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అటు కాపు కమ్యూనిటీ కాని, మెగా అభిమానులు కాని, కుటుంబ సభ్యులు కాని చిరంజీవిని ముఖ్యమంత్రి స్థానం లో చూడాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో వచ్చేది జనసేన ప్రభుత్వమే, తాను సీఎం కావడం ఖాయం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని స్వతంత్య్ర నిర్ణయాలు నచ్చని బిజెపి నేతలు అవసరం రీత్యా అతనితో కలిసి వెళ్లేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి చిరంజీవికి గాలం వేసి తమ పార్టీలోకి లాగేందుకు బిజెపి కేంద్ర అధిష్టానం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో జనాలను ప్రభావితం చేయగల సత్తా పదునైన వాగ్దాటి జనాల్ని కట్టిపడేసే స్టామినా ఎన్టీఆర్ కు ఉండటం, నందమూరి కుటుంబం కావడం, సినీ అభిమానులతో పాటు టిడిపి కేడర్ కూడా సపోర్టు ఉండే అవకాశాలు ఇలా అన్నీ చూసే ఎన్టీఆర్ ను బిజెపిలోకి తీసుకురావాలని ఆయన సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్ద ఎత్తే వేసింది ఎన్టీఆర్ ను బిజెపి వైపు లాగితే ఇక టిడిపిని పూర్తిగా భూస్థాపితం చేసేసినట్టే అని పార్టీ నేతల ఆలోచన. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎన్టీఆర్ ను కలిసి సంప్రదింపులు జరిపారనే ప్రచారం ఉంది. కేంద్ర నాయకులతో సమావేశం సినిమాలకు సంబంధించి మాత్రమేనని పైపైకి చెప్తున్నప్పటికి లోపల జరిగిన విషయం వేరే అన్నది బహిరంగ రహస్యం ఏపీ బిజెపి నేత సోము వీర్రాజు మాత్రం అవసరమైతే వచ్చే ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని, ఏదైనా జరగొచ్చు ఖరాఖండిగా చెప్పెసారు.. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని చివర వరకు ఆ పార్టీ కార్యకర్తగానే ఉంటానని చాలాసార్లు చెప్పిన ఎన్టీఆర్ ను బిజెపి నేతలు కలవడంతో ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది. ఎన్టీఆర్ ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉంటే చాలని టిడిపి భావిస్తుంది. ఎన్టీఆర్ బిజెపికి సపోర్ట్ చేస్తే టిడిపికి నష్టం తప్పదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ అటు టిడిపికి కానీ ఇటు నందమూరి కుటుంబంతో కానీ దగ్గరగా లేరని, తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని, రాజకీయాలలోకి వచ్చి తన సినీ కెరీర్ ను నాశనం చేసుకునే పరిస్థితులలో లేడన్నది అతని సన్నిహితుల మాట. నిజంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా ఒక పార్టీని ప్రారంభించి జనాల లోకే వెళ్తే మాత్రం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రారంభమవుతాయని, రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించి, ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించే సత్తా ఎన్టీఆర్ కు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా రానున్న ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఖాయం
previous post