ఆగ్రా లోని తాజ్ మహల్ ప్రపంచ వింత.. భారత దేశానికి గొప్ప ఐకాన్ నిలిచిన ఆ పాలరాతి సౌధాన్ని ప్రేమ కు చిహ్నం గానే అంతా భావిస్తుంటారు.. ముంతాజ్ స్మృతికి గుర్తుగా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ లాంటి కట్టడమే పర్యాటక రాజధాని విశాఖ లో ఉంది. నగరం లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకప్పుడు విశాఖ తాజ్ మహల్ గా గుర్తింపు పొందిన కురుపాం రాణి సమాధి కాంక్రీటు కట్టడాల మధ్య తన చిరునామాను చెప్పుకోలేక చితికిపోతుంది. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రేమ సమాధి చరిత్రను పాలకులు, వారసులు కలిసి సంయుక్తంగా సమాధి చేసేస్తున్నారు..ద్రావిడ, మొగల్, యూరోపియన్, ఉత్తర భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలిలో నిర్మించిన కట్టడం ఒకప్పుడు అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనం గా నిలిచింది. అందమైన లతలతో.. దశావతార మూర్తులతో.. భగవద్గీత శ్లోకాలతో ఒక దేవాలయ ఆకృతి లో సున్నపురాయితో నిర్మించిన అపూర్వ కట్టడం ఇది. కురుపాం రాజు తన భార్య స్మారక చిహ్నంగా దీనిని నిర్మించారు. విశాఖ నగరాన్ని పరిపాలించిన గోడే జమీందారులలో చివరివాడైన నారాయణ గజపతిరావుకు మగ సంతతి లేదు. కుమార్తెలిద్దరిలో పెద్ద కుమార్తె సీతాబాయిని బెంగాల్ లో ఉన్న వర్ద్వాన్ జమీందారు ఠాకూర్ సాహెబ్ కిచ్చి వివాహం చేసారు. గజపతిరావు రెండో కుమార్తె లక్ష్మీ నరసమ్మను కురుపాం సంస్థానాధిపతి రాజా వైరిచర్ల వీర భద్రరాజుకు ఇచ్చి1895 లో వివాహం చేసారు.దీంతో కురుపాం సంస్థానాధిపతికి విశాఖపట్నంతో అనుబంధం ఏర్పడింది. 1902లో ప్రసవ సమయంలో రాణి లక్ష్మీ నరసాయమ్మ కన్నుమూశారు. ఆమె మృతి రాజుని తీవ్రంగా కలచివేసింది.. మానసికంగా కృంగిపోయారు. ఆమెపై తన శాశ్వతమైన ప్రేమను వ్యక్తీకరించడానికి తన రాణి జ్ఞాపకార్థం ఒక సమాధిని నిర్మించాలనినిర్ణయించుకున్నదే తడవుగా సముద్ర తీరంలో ప్రస్తుత వుడా పార్క్ సమీపంలో నిర్మాణాన్ని ఆరంభించారు. 1905 జూలై 8న సమాధి నిర్మాణం పూర్తయింది. గోడకు నాలుగు వైపులా ఆంగ్లంలో రాణి అందాన్ని కీర్తిస్తూ కవితలు రాశారు.