గురు పూర్ణిమ వ్యాసుడి కోసం మాత్రమే

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!
లోకానికంతటికీ జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవుడు వేద వ్యాసుడు ఆయన జన్మ తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ‘గురు పూర్ణిమ’గా మనం జరుపుకుంటున్నాం సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యక్తి కాబట్టే మానవాళికంతటికీ ఆయననే గురువుగా భావించి వ్యాస పూర్ణిమ ను గురు పౌర్ణమి భావించి నిర్వహిస్తూ ఉంటారు.. వేదవ్యాసుని పూర్వనామం- కృష్ణ ద్వైపాయనుడు.
వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేసిన అనంతరం వేదవ్యాసుడిగా మారారు..
గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..
ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః || శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను స్వీకరించే వారే గురువు అందుకే మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని మన వేద వాఙ్మయం కల్పించింది..
నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః
’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవని తెలిపే ఈ శ్లోకం ఈ రోజు తప్పకుండా స్మరించుకోవాలి.. గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా శుభకరం.. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యుల వారిని వంటి వారితో పాటు మనకు విద్యను ప్రధానం చేసిన గురువులను పూజించే విశిష్ట దినం ఈ గురు పూర్ణిమ.

వ్యాసుడు అనేది పేరు కాదు..

నిజానికి వ్యాసుడు అనేది నామధేయం కాదు అదొక పదవి ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు
ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో
4 పాదాలతో , త్రేతాయుగంలో, 3 పాదాలతో , ద్వాపరయుగంలో, 2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో నడుస్తుంది. వసిష్ఠమహామునికి ముని మనుమడు , శక్తి మహా మునికి మనుమడు , పరాశర మునికి పుత్రుడు , శుకమహర్షి కి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కరిస్తూ ఆది గురువుగా ఆయనను భావిస్తూ గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ ను జరుపుకుంటారు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాగా ఆయన కన్నా ముందు వ్యాసపీఠాన్ని అలంకరించిన వారు స్వాయంభువ ,ప్రజాపతి, ఉశన, బృహశ్పతి, సవిత, మృత్యువు,ఇంద్ర, వశిష్ఠ , సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ ,అంతరిక్షక ,ధర్ముడు, త్రయారుణ , ధనుంజయుడు , కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజశ్రవ, సోమశుష్మాయణ, ఋక్షుడు, శక్తి, పరాశరుడు, జాతూకర్ణి వంటి ఇరవై ఏడుగురు వ్యాసులు గా వున్నారు. కృష్ణ ద్వైపాయనుడి గా జన్మ తీసుకున్న వ్యాసుని తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారం గా వస్తుంది.. పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించడం తో కృష్ణద్వైపాయనుడు.. జన్మ తీసుకున్న వెనువెంటనే చేత కమండలం, దండము చేతబట్టి తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన కృష్ణ ద్వైపాయనుడు సోమకాసురుడు అనే అసురుడు.. సముద్రంలో వేదాలను దాచేస్తే మత్స్యావతారంలో శ్రీ మహా విష్ణువు బయటకు తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసిపోతే వాటిని నాలుగు వేదాలుగా నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేద వ్యాసుడైనాడు. మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా…. అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. భగవానుని ముఖతః వెలువడినదే వేదము. వేదములో లేనివి— మరెక్కడా లేవు. ఏక రూపంలో ఉండే వేదాలను అర్థం చేసుకోలేరని, భగవానుడే ద్వాపరయుగంలోను వ్యాసుడుగా అవతరించాడని పండితులు చెప్తుంటారు..


ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా … వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను , భారత , భాగవతాలని మనకు ప్రసాదించాడు. అందుకే సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరు.
“వ్యాసాయ విష్ణు రూపాయ… వ్యాస రూపాయ విష్ణవే. నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!
అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి తన శిష్యగణమైన పైలుడకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. ఆయన అనుగ్రహం తో జ్ఞానం విశ్వవ్యాప్తమై వర్ధిల్లింది.


ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన సంఘటనలు , సృష్టికి పూర్వం జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిక్షిప్తమయినాయి. వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేరు , చదవలేరు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం !
వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. దక్షిణాదిన కుంభ కోణంలో , శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే , ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే
ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి , సకల శాస్త్రవేత్త , శస్త్ర చికిత్సవేది , మేధానిధి , వైద్యవరుడు , ఆత్మవిద్యానిధి , వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.
మనందరికీ దేవరుణము , ఋషిరుణము , పితృఋణము అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం , ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. గురు పౌర్ణమి రోజు ఇలాంటి మహనీయులను పూజించాలి.. స్మరించాలి.. గత కొన్నేళ్లుగా గురుపూర్ణిమ అంటే సాయి బాబా కి సంబందించినది గా మార్చడం లో కొంతమంది భక్తులు సఫలీకృతం కావడం గురు పౌర్ణమి విశిష్టత ను భంగ పరచడమే.. పుట్టిన రోజు ఒకరిదైతే ఉత్సవాలు వేరొకరికి ఎందుకో భక్తులు ఆలోచించాల్సిన అవసరం వుందని ధర్మ ప్రబోధకులు కొందరు భావిస్తున్నారు..
(వివిధ మాధ్యమాలు, గ్రంథాల నుంచి సేకరించిన వ్యాసం)

Related posts

టికెట్ ధరకు విలువైన వినోదాన్ని గ్యారెంటీగా ఇస్తుందంటున్న దర్శకుడు

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More