దేశం లోనే అతిపెద్ద స్వర్ణరధం

వేంకటాద్రి సమం స్థానం.. బ్రహ్మాండే నాస్తికించన.. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి.. వెంకటాద్రి కి సమానమైన స్థానంగాని వెంకటేశ్వరునికి సమానమైన దైవంగాని ఈ బ్రహ్మాండంలో లేరు.. ఇది పురాణాలు చెప్పిన మాటే అయినా నేటికి కూడా వాస్తవ దృశ్యం ఇదే.. ఇలలో ఇలాంటి ఆలయం.. ఆదరణ.. ఆదాయం.. మరి దేనికి లేవు అన్నది నిఖార్సైన సత్యం. అంత విశిష్ట ఆలయంలో మరో అద్భుతం.. శ్రీవారి స్వర్ణ రధం. భారతదేశంలో అతిపెద్ద స్వర్ణరథం.. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సేవా స్వర్ణ రథం ఇదొక్కటే.. ఇరవై ఒక్కఏళ్ల పాటు సేవలందించిన వెండి రథం స్థానే 2013లో ఈ స్వర్ణరథం స్వామి సేవలో భాగమైంది..1992లో నిర్మించిన వెండి రథం శ్రీవారికి సంబంధించిన అన్ని ఉత్సవాలలో పాలుపంచుకునేది. అయితే వివిధ కారణాలతో కాలక్రమేణ ఏర్పడిన లోపాల కారణంగా శ్రీవారి ఊరేగింపు కి కొత్త రధాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదనతో స్వర్ణ రథాన్ని తయారు చేయించాలని సంకల్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని నభూతో న భవిష్యతి అన్న రీతిలోనే స్వర్ణ రథం ఉండాలని భావించి భక్తుల విరాళాల ద్వారా వచ్చిన బంగారంతోనే రథాన్ని తయారు చేయించాలని నిర్ణయించారు. 74 కేజీల 24 క్యారెట్ల బంగారం, 2, 900 కేజీల రాగి, 32 అడుగుల ఎత్తు తో దారుకలపతో కలిపి 29 టన్నుల బరువు ఉన్న రథాన్ని తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ సహకారంతో 18 మంది స్వర్ణకారులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర మ్యూజియంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తయారు చేశారు. 18 గేజ్ కాపర్ షీట్లపై 9 లేయర్ల స్వర్ణ తాపడంతో ఈ రధనిర్మాణం జరిగింది. స్వామివారికి ఇరువైపుల జయవిజయులతో పాటు రథాన్ని నడిపే సారధి రెక్కలతో కూడిన రెండు అశ్వాలు ఈ రథం లో ఉండేలా దీన్ని రూపొందించారు ఠీవీగా నిలిచే స్తంభాలు స్వామి సేవలో తామే ముందున్నామన్న గర్వంతో భక్తులకు దర్శనమిస్తాయి.. నాటి లెక్కల ప్రకారం సుమారు 24 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు.. ఈ రథానికి ప్రముఖ సంస్థ బీహెచ్ఈ ఎల్ హైడ్రాలిక్ బ్రేక్స్ లాంటి సాంకేతిక సహకారాన్ని అందించింది. ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్న సమయంలో 2013 అక్టోబర్ 10వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణ రథోత్సవంలో భాగంగా తొలిసారిగా ఈ దివ్య రథం పై విహరించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు అప్పటినుండి ఈ స్వర్ణనాథం తిరుమల ఉత్సవాలలో ప్రత్యేకం. అయితే ఈ స్వర్ణ రథం కేవలం అలంకరణ రథం మాత్రమేనని వైకానస ఆగమము అనుసారం రథోత్సవానికి వెండి రధమే సరైనదని పండితులు ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం కోసమెరుపు.

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More