తిరుమల లో మాడ వీధులు ఎక్కడున్నాయి..ఆ వీధులు ఎందుకంత ప్రత్యేకం..

తిరుమల మాడ వీధులలో ఊరేగిన శ్రీవారు.. అని మనం తరచుగా వింటుంటాం.. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులలో జరుగుతుంటాయి.. అసలింతకి మాడ వీదులు అంటే ఏంటి..? అలా ఎందుకు వ్యవహరిస్తారు.. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. వాటినే మాడవీధులుగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు మాత్రం తిరుచానూరులో జరిపేవారు. శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు..ఆనంద నిలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు ఆలయం తూర్పు ముఖంగా ఉన్నవీధి ని తూర్పు మాడవీధి గా వ్యవహరిస్తారు.. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు తూర్పు మాడ వీధి విస్తరించి ఉంది.. గతంలో పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.

ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు.. ఈ వీధి లో ఒకప్పుడు వేయికాళ్ళ మండపం ఉండేది సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా దుకాణాలు ఉండేవి.ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉన్నాయి.. క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ నిర్మించిన వెయ్యి కాళ్ళ మండపం మాస్టర్ ప్లాన్ లో ఈ చారిత్రాత్మక కట్టడం తొలగించబడింది. దక్షిణ మాడవీధి ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే బ్రిడ్జ్ కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో ఉన్న (ఆగ్నేయంలో) ‘ఊంజల్ మండపం’ తిరుమల నంబి ఆలయం కూడా సమీపంలో ఉంది దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత ‘ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది. ఇక పడమర మాడ వీధి. ఆలయానికి వెనక వైపున ఉంది ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఇక్కడే ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులోనే ఉంది. నాల్గవఉత్తర మాడ వీధి. ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి ‘అచ్యుతరాయ కోనేరు’ అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది. ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మఠం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం – ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కూడా ఉన్నాయి ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు. చాలామంది భక్తులు ఈ మహా ప్రదక్షిణ చేస్తుంటారు.. అన్నీ విశేషాలే గల తిరుమలలో మాడవీధులు మరింత ప్రత్యేకం.

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More