ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాకు ‘సారంగపాణి జాతకం’ టైటిల్ ఖరారు

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో చెప్పాం. హీరో పాత్రలో భావోద్వేగాలను, వినోదాన్ని ప్రియదర్శి తనదైన శైలిలో అద్భుతంగా పండించగా… అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ తన అభినయంతో కట్టి పడేస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా చూడగలిగే ఒక హాస్య సంబరం ఈ సినిమా. ఉన్నత సాంకేతిక ప్రమాణాలు అందించే శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. పీజీ విందా ఛాయాగ్రహణం, వివేక్ సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ కూర్పు, రవీందర్ కళా దర్శకత్వం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయి” అని చెప్పారు.
చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా ఇది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఆయనతో మా సంస్థలో మూడో చిత్రమిది. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో నాలుగు పాటలకు వివేక్ సాగర్ అద్భుతమైన బాణీలు అందించారు. సంగీతానికి సినిమాలో మంచి ప్రాముఖ్యం ఉంది. మా సంస్థలో 15వ చిత్రమిది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’, ‘యశోద’ – హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More