కాశీ కన్నా పురాతన క్షేత్రం విరుధాచలం

దక్షిణాది వారికి కాశీ ప్రయాణమంటే కొద్దిగా ఖర్చుతో, ఇంకాస్త ప్రయాసతో కూడిన యాత్ర ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా గంగ లో స్నానమాచరించి కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించి తీరాల్సిందే.. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కాశీ సందర్శన వీలు కానప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన పూర్వీకులు ఎక్కడికక్కడ చేసి పెట్టారు. కాశీ కి సరిసమానంగా దర్శించుకునే ఓ దివ్యక్షేత్రం అరుణాచలానికి కేవలం వంద కిలోమీటర్ల దూరం లొనే ఉంది కోరిన కోర్కెలు తీర్చి ఆరోగ్యాన్నిచ్చే ఆ పవిత్ర పుణ్యక్షేత్రమే వృద్ధకాశీ కాశీ కన్నా పుణ్యప్రదమైన దివ్యప్రదేశం వృధ్ధాచలం. విరుధాచలం..కాశీ కన్నా పురాతనమైనదని ఇక్కడి స్థలపురాణం చెప్తున్న మాట. ఇది కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు ఈ భూమిమీదే అతి ప్రాచీనమైన ఆలయమని శాసనాలు చెప్తున్నాయి.. వృద్ధాచలం కొండ కూడా పరమేశ్వర స్వరూపం గానే చెపుతారు.పరమశివుడు తొలుత ఇక్కడ కొండరూపంలో వెలిశాడని అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని తరువాత విరుధాచలంగా ఖ్యాతి పొందిందని అంటారు. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాధ ను పరిశీలిస్తే బ్రహ్మ సృష్టి సంకల్ప తరుణంలో అనంత జలరాశిలో భూమి కోసం ప్రయత్నిస్తూ, పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలోనే విష్ణుమూర్తి చేతిలో మధుకైటభులు హతమయ్యారు. వాళ్ళ శరీరాలు నీటిమీద మహా పర్వతాలలాగా తేలాయి . పరమ శివుడు కూడా బ్రహ్మ కోరిక మీద ఒక పర్వత రాజంగా అవతరించారు . ఆ మధుకైటభుల శరీరాల్ని జలంతో కలిపి మేథిని అనే పేరుతొ భూమిని సృష్టించారు. అయితే వీటన్నింటికన్నా ముందు తానే పర్వతంగా, భూమిగా అవతరించి, భూమి , తానూ ఒక్కటే అన్న సత్యాన్ని తెలియజేశారు. అలా పర్వతంగా దర్శనమిచ్చిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు పూజించారు. ఆ గిరీశ్వరుడే వృద్ధాచల పరమేశ్వరుడు . శైవులకి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో నాలుగు క్షేత్రాలు అత్యంత ముఖ్యమైనవాటిగా చెప్తారు. అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో విరుధాచలం ఒకటి.ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని, ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరకుండా నిలిచిందనీ భక్తుల నమ్మకం. ఇక్కడే పరమ శివుడు ఆనంద నాట్యం చేశాడంటారు. ఇక్కడ పుట్టినా, గిట్టినా, నివసించినా, భగవంతుణ్ణి ప్రార్ధించినా, ఈ స్వామిని తలచినా తక్షణమే మోక్షం లభిస్తుందంటారు.పూర్వం ఒకసారి ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలతో, చాలా ఇబ్బందులలో వుంటే, స్వామి నాకు సేవ చేయండి, చేసినవారికి చేసినంత ఫలితం లభిస్తుందని చెప్పాడుట. ఆ సమయంలో విభాసిత మహర్షి ఇక్కడ మణిముతా నదిలో స్నానం చేసి, ఈ ఆలయ పునరుధ్ధరణ కార్యక్రమం చేపట్టారు . అక్కడ పనిచేసిన వారికి ఆయన స్ధల వృక్షమైన వన్ని చెట్టు ఆకులు కూలీకింద ఇచ్చేవాడుట. ఆ మనిషి చేసిన పని, దాని నాణ్యతకు తగినట్లుగా ఆ ఆకులు నాణాలుగా మారేవిట. అప్పటినుంచే చేసినవారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకున్నంత అనే నానుడి వచ్చిందని అంటారు. ఇక్కడి వృక్షం 1700 సంవత్సరాల క్రితందని చెప్తుంటారు. అరుణాచలం లో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ గిరి ప్రదక్షిణ చేస్తారు. వల్లీ దేవసేనలతోకొలువుతీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయంలో పైన చక్రాలుంటాయి. ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయాలలో చూస్తాం. అందుకే ఇక్కడ స్వామికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయట. శైవ సిధ్ధాంతానుసారం 28 ఆగమ శాఖలు వున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిధ్ధాంతాలకు ప్రతీకగా 28 శివ లింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడట. ఆ సిధ్ధాంతాల పేర్లతోనే శివుని పేర్లు కూడా కామికేశ్వరుడు, యోగేశ్వరుడు వగైరా పేర్లు కూడా చూడవచ్చు. ఈ విశేషంవల్ల ఈ ఆలయానికి ఆగమ ఆలయమనే పేరుకూడా ఉంది అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలంనుంచి కిందకి వున్న ఆలయంలో వుంటాడు. ఈయనని దర్శించటానికి 18 మెట్లు దిగి వెళ్ళాలి ఇక్కడి అమ్మవారి పేరు వృధ్ధాంబిక. పూర్వం నమశ్శివాయార్ అనే భక్తుడు చిదంబరం వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ బస చేశాడు. ఆయనకి బాగా ఆకలయింది. పరమేశ్వరిని ఆకలి తీర్చమంటూ చేసిన స్తుతిలో అమ్మని “కిజతి” అంటే పెద్దావిడ, ముసలావిడ అనే పదం వాడాడు. ఆ తల్లి వృధ్ధురాలి వేషంలో వచ్చి, నమశ్శివాయార్ తో ముసలివాళ్ళు భోజనం పెట్టలేరు, చిన్నవాళ్ళే పెట్టగలరని చెప్పిందట. అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని యువతిగా వర్ణిస్తూ పాడేసరికి అమ్మ ఒక యువతిగా వచ్చి ఆయనకి భోజనం పెట్టిందట. అప్పటినుంచి అమ్మని బాలాంబిక అంటారు. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్ళుగా మారి నది అడుగున వుంటాయిట. వీటన్నింటితో పాటు ఆలయంలో ఐదో నెంబరుకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు ఐదు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామికి ఐదు పేర్లు విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుధ్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. అలాగే ఐదు వినాయక విగ్రహాలున్నాయి. రోమేశుడు, విబాశిధ్ధు, కుమారదేవుడు, నాదశర్మ అనవర్ధిని అనే ఐదుగురు ఋషులు స్వామి సేవలో తరించారు ఐదు గోపురాలు, ఐదు ప్రాకారాలు, ఐదు మండపాలు, ఐదు నందులు ఐదు రధాలు ఉండగా సుప్రభాతం నుంచి శయన సమయం వరకు స్వామికి ఐదు సార్లు విశేష పూజలు చేస్తారు. పరమ శివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిధ్ధి. ఈయన చిదంబరంలో కాళితో పోటీపడి నృత్యం చేస్తే, ఇక్కడ వృధ్ధాచలంలో తన సంతోషంకోసం నాట్యం చేసిన పవిత్ర ప్రదేశం ఇది. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More